శంషాబాద్‌లో రూ.12 కోట్ల బ్యాంకు కుంభకోణం కలకలం.
• డిపాజిటర్ల డబ్బుల దుర్వినియోగం ఆరోపణలు.
• సీఈవో, క్లర్క్‌పై చర్యలకు డిమాండ్
రంగారెడ్డి, మహా.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని చిన్న గోల్కొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) బ్యాంకులో భారీ ఆర్థిక అక్రమాలు వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. 2008 నుంచి 2011 మధ్యకాలంలో డిపాజిటర్లకు చెందిన సుమారు రూ.12 కోట్ల నిధులు అక్రమంగా మళ్లించారనే ఆరోపణలు రావడంతో బాధితులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. బ్యాంకు ముందు చేరిన డిపాజిటర్లు నినాదాలు చేస్తూ తమ సొమ్మును వెంటనే తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు.
బ్యాంకు మాజీ సీఈవో బల్లమోని యాదయ్య, క్లర్క్ సురేందర్ యాదవ్ కుమ్మక్కై డిపాజిటర్ల డబ్బును అక్రమంగా దారి మళ్లించారని బాధితులు ఆరోపించారు. దీర్ఘకాలంగా కష్టపడి కూడబెట్టిన పొదుపు మొత్తాలు బ్యాంకులో భద్రంగా ఉంటాయని నమ్మి డిపాజిట్ చేసిన తమకు ఇప్పుడు తీవ్ర అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాల విషయం వెలుగులోకి రావడంతో డిపాజిటర్లు ఒక్కసారిగా బ్యాంకు వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు.
ఆందోళన ఉద్ధృతంగా మారడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బ్యాంకు పరిసరాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. డిపాజిటర్లు మాత్రం బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకుని తమ డబ్బు తిరిగి చెల్లించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ బ్యాంకుపై దాదాపు పది గ్రామాల రైతులు, చిరు వ్యాపారులు, సాధారణ ప్రజలు ఆధారపడుతున్నారని బాధితులు తెలిపారు. రెండు, మూడు దశాబ్దాలుగా తమ పొదుపు మొత్తాలను ఈ సహకార బ్యాంకులోనే భద్రపరుస్తూ వచ్చామని, ఇప్పుడు కోట్ల రూపాయల కుంభకోణం వెలుగులోకి రావడంతో కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టార్జితాన్ని కాజేసిన వారిని వెంటనే అరెస్టు చేసి, అక్రమంగా మళ్లించిన నిధులను రికవరీ చేసి డిపాజిటర్లకు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు.
బ్యాంకు నూతన సీఈవో యాదగిరి రెడ్డి ఈ వ్యవహారంపై స్పందిస్తూ, డిపాజిట్లకు సంబంధించిన అక్రమాలు జరిగినట్లు గుర్తించిన వెంటనే జిల్లా సహకార అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లా సహకార శాఖ అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారని, విచారణ నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన అన్ని రికార్డులను క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని, డిపాజిటర్లకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని యాదగిరి రెడ్డి హామీ ఇచ్చారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బ్యాంకు కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు.
ఇప్పటికే ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు బ్యాంకు యాజమాన్యం వెల్లడించింది. జిల్లా సహకార శాఖ చేపట్టిన దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు, తమ కష్టార్జితాన్ని కాపాడాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుని నష్టపోయిన ప్రతి డిపాజిటర్‌కు న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.








