Mahaa Daily Exclusive

  చిన్న సివిల్ కాంట్రాక్టర్లకు చేయూత నివ్వండి

Share

  • జీఓ నంబర్-94 అమలు చేయాలని జీడబ్ల్యూఎంసీ అధికారులకు వినతి
  • హార్టికల్చర్ టెండర్లలో సివిల్ కాంట్రాక్టర్లకు కూడా అవకాశం ఇవ్వాలి
  • ఎంపానెల్‌మెంట్ నిబంధనలతో 300 మంది చిన్న కాంట్రాక్టర్లకు తీరని అన్యాయం

వరంగల్, బ్యూరో మహా;

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సుమారు 300 మంది స్థానిక కాంట్రాక్టర్లకు టెండర్లు లేక ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు.

బల్దియా పరిధిలో చేపడుతున్న హార్టికల్చర్, గ్రీనరీ అభివృద్ధి పనుల టెండర్ల లో సివిల్ కాంట్రాక్టర్ లైసెన్స్ కలిగిన స్థానిక కాంట్రాక్టర్లకు కూడా అవకాశం కల్పించాలని గ్రేటర్ వరంగల్ సివిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎంఎస్ నంబర్-94 తో పాటు సంబంధిత నిబంధనలను అమలు చేసి టెండర్ షరతులను సవరించాలని కోరింది. ఈ మేరకు శుక్రవారం అసోసియేషన్ ప్రతినిధులు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న, తో పాటు సూపరింటెండింగ్ ఇంజినీర్ రాజ్‌కుమార్‌ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హార్టికల్చర్ పనుల కేటాయింపులో ఐ అండ్ సీఏడీ శాఖ జీఓ ఎంఎస్ నంబర్-94 నిబంధనలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీని పై అధికారులు సానుకూలంగా స్పందించి అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా టెండర్ నిబంధనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.

ఎంపానెల్‌మెంట్‌ తో స్థానికులకు నష్టం

ప్రస్తుతం జీడబ్ల్యూఎంసీ హార్టికల్చర్ టెండర్లలో జీహెచ్‌ఎంసీ బయోడైవర్సిటీ విభాగం ఎంపానెల్‌మెంట్‌ను తప్పనిసరి చేయడం వల్ల స్థానికంగా ఉన్న చిన్న కాంట్రాక్టర్లు తీవ్రంగా నష్టపోతున్నారని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. జీహెచ్‌ఎంసీ ఎంపానెల్‌మెంట్ హైదరాబాద్ పరిధికే పరిమితమని, అదే నిబంధనను వరంగల్‌ లో అమలు చేయడం వల్ల కొద్దిమందికే పనులు దక్కుతున్నాయని పేర్కొంది. దీంతో కొత్తగా రంగంలోకి వచ్చిన కాంట్రాక్టర్ల కు అవకాశాలు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. సివిల్ కాంట్రాక్టర్ లైసెన్స్ ఉన్న వారికి వారి క్లాస్‌ కు అనుగుణంగా నిర్దిష్ట విలువ వరకు పనులు చేపట్టే అర్హత ఉందని అసోసియేషన్ వివరించింది. జీఓ ఎంఎస్ నంబర్లు 94, 16, 66, 142 ప్రకారం రూ.5 లక్షల లోపు పనులకు అనుభవం లేకున్నా లైసెన్స్ ఉన్న కాంట్రాక్టర్లకు అవకాశం కల్పించే నిబంధన ఉందని గుర్తు చేసింది. అదే విధానాన్ని జీడబ్ల్యూఎంసీ లో కూడా అమలు చేయాలని కోరింది.

లాభపడనున్న 300 మంది చిన్న కాంట్రాక్టర్లు

పక్కా జిల్లాలు అయిన కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల తో పాటు పలు మున్సిపాలిటీలు, అటవీ, ప్రజారోగ్య, ట్రాన్స్‌ కో శాఖల్లో హార్టికల్చర్ పనులను సివిల్ కాంట్రాక్టర్ల ద్వారానే చేపడుతున్నారని పేర్కొంది. అదే విధానాన్ని వరంగల్‌ లో అమలు చేస్తే దాదాపు 300 మంది స్థానిక చిన్న కాంట్రాక్టర్ల కు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించింది. వరంగల్‌ లో విమానాశ్రయం, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, ఐటీ పార్క్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో గ్రీనరీ అభివృద్ధి పనుల్లో ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తే నగర అభివృద్ధికి తోడ్పడుతుందని అసోసియేషన్ అభిప్రాయపడింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు పూజారి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు సుధాకర్, కమిటీ సభ్యులు రాజేందర్, సతీష్, ఎల్లయ్య, శీను, విక్రమ్, బిక్షపతి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.