ఢిల్లీ, మహా.
నీట్-యూజీ పరీక్షల నిర్వహణలో అక్రమాలు, అనంతర పరిణామాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి రాజీనామా లేఖ పంపినట్లు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. యువత భవిష్యత్తు, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొంటూ తన రాజీనామా లేఖలో భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.
రాజీనామా లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, మే 3, 2026న నిర్వహించిన నీట్-యూజీ పరీక్షలో అక్రమాలు వెలుగుచూడగానే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించిందన్నారు. కేసును సీబీఐకి అప్పగించడంతో పాటు పరీక్షను రద్దు చేసి పునఃపరీక్ష నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత (సీబీటీ) విధానంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగం, తల్లిదండ్రుల సహకారంతో జూన్ 21న 20 లక్షల మందికి పైగా విద్యార్థులకు పునఃపరీక్షను విజయవంతంగా నిర్వహించామని, జూలై 16న ప్రకటించిన ఫలితాల్లో పేద కుటుంబాలకు చెందిన అనేక మంది విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారని పేర్కొన్నారు.
ఈ ఘటనకు తొలి రోజు నుంచే తానే పూర్తి బాధ్యత వహించానని ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. పరీక్షల మాఫియా కారణంగా ఏ ప్రతిభావంతుడైన విద్యార్థి భవిష్యత్తు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యతగా భావించామని తెలిపారు.
గత పది రోజులుగా జంతర్‌మంతర్ వద్ద కొనసాగుతున్న ఆందోళనలు, దేశంలో నెలకొన్న పరిస్థితులే తన రాజీనామా నిర్ణయానికి ప్రధాన కారణమని లేఖలో పేర్కొన్నారు. విద్యార్థులు చట్టపరమైన సమస్యల్లో చిక్కుకోకుండా, వారి విలువైన సమయాన్ని చదువు, కెరీర్‌పైనే వెచ్చించాలని కోరారు. ఆందోళనలను దేశ వ్యతిరేక శక్తులు తమ స్వార్థ ప్రయోజనాలకు వినియోగించకుండా, దేశ ఐక్యతకు భంగం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. యువతను కొందరు బాధ్యతాయుత పదవుల్లో ఉన్న వ్యక్తులు తప్పుదోవ పట్టించడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నాలుగు దశాబ్దాలుగా విద్యారంగానికి సేవ చేసే అవకాశం లభించడం తన అదృష్టమని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశానికి సేవ చేయడం గర్వకారణమని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. శ్రీ జగన్నాథుని ఆశీస్సులతో భవిష్యత్తులోనూ భారత్‌మాత, ఒడిశా ప్రజలు, దేశ యువత ఆకాంక్షల సాధన కోసం నిరంతరం కృషి చేస్తానని తన రాజీనామా లేఖలో వెల్లడించారు.







