Mahaa Daily Exclusive

  ధర్మేంద్ర రాజీనామా విద్యార్థుల విజయం. ఇంకా రెండు డిమాండ్లు పెండింగ్: దీప్కే.

Share

ఢిల్లీ, మహా.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. నీట్ పేపర్ లీక్ బాధిత విద్యార్థులకు న్యాయం జరిగిందని, ఇది విద్యార్థుల విజయమని పేర్కొన్నారు. అయితే తమ రెండు ప్రధాన డిమాండ్లు ఇంకా నెరవేరలేదని, అవి అమలయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

జంతర్‌మంతర్ వద్ద మీడియాతో మాట్లాడిన అభిజీత్ దీప్కే, “బొద్దింకల సత్తా అందరికీ తెలిసొచ్చింది. బొద్దింకలు ఒకసారి వస్తే వెళ్లగొట్టడం సాధ్యం కాదు” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రజల గొంతుకను ఎవరూ అణచివేయలేరని, విద్యార్థుల ఐక్యతే ఈ విజయానికి కారణమని అన్నారు.

తమను తాము బాద్షాలుగా భావిస్తున్న పాలకులను ప్రజాస్వామ్య పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని, యువత ఓట్ల ద్వారానే నేడు వారు అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. ప్రజలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, పాలకులను ప్రజాస్వామ్యబద్ధంగా అదుపులో ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు.

సీజేపీ తరఫున పెట్టిన రెండు కీలక డిమాండ్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని, అవి నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని దీప్కే స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, సీజేపీ ప్రతినిధులు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్న వేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ‘ఎక్స్’ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.