Mahaa Daily Exclusive

  భోగస్ ఓట్లకు తావులేకుండా పారదర్శకంగా నమోదు జరగాలి.

Share

  • రాహుల్ అండ్ కో ఆందోళనలు రాజకీయ కక్ష సాధింపులో భాగమే: డాక్టర్ పొంగులేటి సుధాకరరెడ్డి

జహీరాబాద్,మహా.

ఓటరు జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించి, భోగస్ ఓట్లు ఏ పరిస్థితుల్లోనూ చోటు చేసుకోకుండా చూడడంతో పాటు అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా వెలుపల ఉండకుండా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా పనిచేయాలని బీజేపీ జాతీయ నాయకుడు, కర్ణాటక–తమిళనాడు రాష్ట్రాల ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పొంగులేటి సుధాకరరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జహీరాబాద్ నియోజకవర్గంలోని రంజోల్ మండలంలో పార్టీ బీఎల్వోలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పార్టీ పరంగా చేపడుతున్న ఓటర్ల నమోదు (ఎన్‌రోల్‌మెంట్) కార్యక్రమాన్ని సమీక్షించి పలు సూచనలు చేశారు.

ఓటరు జాబితా ప్రజాస్వామ్యానికి పునాదని పేర్కొన్న ఆయన, ప్రతి బీఎల్వో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. నకిలీ ఓట్ల నమోదుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని, అదే సమయంలో ఓటు హక్కుకు అర్హులైన ప్రతి పౌరుడి పేరు తప్పనిసరిగా జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి ఇంటిని సంప్రదిస్తూ వాస్తవ పరిస్థితులను నమోదు చేయాలని, ఓటరు జాబితా విశ్వసనీయతను కాపాడడంలో కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.

అనంతరం దేశ రాజకీయ పరిణామాలపై స్పందించిన సుధాకరరెడ్డి, కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఆందోళనలను తీవ్రంగా విమర్శించారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులు చేపడుతున్న నిరసనలు ప్రజా ప్రయోజనాల కోసం కాదని, పూర్తిగా రాజకీయ అజెండా, కక్షపూరిత ధోరణిలో భాగంగానే కొనసాగుతున్నాయని ఆరోపించారు. చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, దేశంలో అరాచకాలు, అక్రమాలు జరుగుతున్నా ప్రభుత్వం చూస్తూ కూర్చోవాలా అని ప్రశ్నించారు.

“అరాచకాలను చూస్తూ కూర్చుంటే మోదీ మంచివాడా? చట్ట విరుద్ధ కార్యకలాపాలను అడ్డుకుంటే విమర్శించడమేనా?” అని ఆయన ప్రశ్నించినట్లు తెలిపారు. చట్టబద్ధ పరిపాలనను విమర్శించడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను బీజేపీ సమర్థవంతంగా తిప్పికొడుతుందని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తోందని, బీజేపీ కార్యకర్తలు గ్రామస్థాయిలో ప్రజలను కలుసుకుంటూ వాస్తవాలను వివరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటరు నమోదు ప్రక్రియలో పారదర్శకత, ఖచ్చితత్వం పాటించడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని సుధాకరరెడ్డి అన్నారు.