- పోలీసులతో వాగ్వివాదం.. వీడియో వైరల్.
ఢిల్లీ, మహా.
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో పోలీసులతో వాగ్వివాదానికి దిగిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తనను ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించిన వాంగ్‌చుక్, తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ నేలపై పడుకుని నిరసన తెలిపారు.
జంతర్‌మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన వాంగ్‌చుక్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు జూలై 18న పోలీసులు సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆయనను మేదాంత ఆస్పత్రికి తరలించేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో జూలై 21న అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే పోలీసులు తనను వెళ్లనీయకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ వాంగ్‌చుక్ వారితో వాగ్వివాదానికి దిగారు.
“నన్ను అరెస్ట్ చేయమని చెప్పండి. మీరు నన్ను వేధిస్తున్నారు. ఒత్తిడితో నాకు ఏదైనా జరిగితే అందుకు మీరే బాధ్యత వహించాలి” అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన పోలీసులు, తాము ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆస్పత్రి వైద్యుడితోనూ వాంగ్‌చుక్ తీవ్ర వాగ్వివాదానికి దిగారు.
తర్వాత మేదాంత ఆస్పత్రికి చేరుకున్న అనంతరం విడుదల చేసిన వీడియోలో, తమ సామాన్లు మొత్తం సర్దుకున్నప్పటికీ దాదాపు మూడు గంటల పాటు సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లనివ్వలేదని వాంగ్‌చుక్ ఆరోపించారు. పరిస్థితుల వల్లే తాను నిరసనకు దిగాల్సి వచ్చిందని, నేలపై పడుకుని ఆందోళన చేయాల్సి వచ్చిందని తెలిపారు.







