- కాంస్యంతో మెరిసిన ఝండూ కుమార్.
గ్లాస్గో, మహా.
కామన్వెల్త్ గేమ్స్–2026లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. బిహార్‌కు చెందిన పారా పవర్‌లిఫ్టర్ ఝండూ కుమార్ పురుషుల హెవీవెయిట్ విభాగంలో కాంస్య పతకం సాధించి ఈ క్రీడల్లో భారత ఖాతాను ప్రారంభించాడు. అతని విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేస్తూ, అంతర్జాతీయ వేదికపై దేశ గౌరవాన్ని నిలబెట్టిన క్రీడాకారుడిగా ప్రశంసించారు.
హెవీవెయిట్ పారా పవర్‌లిఫ్టింగ్ పోటీలో ఝండూ కుమార్ మొత్తం 190 కిలోల బరువును ఎత్తి 130.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. తొలి ప్రయత్నంలో 181 కిలోలను విజయవంతంగా ఎత్తిన ఆయన, రెండో ప్రయత్నంలో 190 కిలోలను కూడా అధిగమించాడు. అయితే చివరి ప్రయత్నంలో 196 కిలోలను ఎత్తేందుకు ప్రయత్నించి విఫలమవడంతో కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కేవలం 0.1 పాయింట్ల తేడాతో రజత పతకం చేజారడం విశేషం.
ఈ విభాగంలో నైజీరియాకు చెందిన రిలువాన్ ఇద్రిస్ 132.8 పాయింట్లతో స్వర్ణ పతకం సాధించగా, ఇంగ్లండ్‌కు చెందిన మాథ్యూ హార్డింగ్ 131.0 పాయింట్లతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
ఝండూ కుమార్ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో స్పందిస్తూ, హెవీవెయిట్ పారా పవర్‌లిఫ్టింగ్‌లో కాంస్య పతకం సాధించడం గొప్ప విజయమని కొనియాడారు. అపారమైన శక్తి, సంకల్పం, ఎన్నో ఏళ్ల క్రమశిక్షణతో కూడిన సాధనకు ఈ పతకం నిదర్శనమని పేర్కొన్నారు. అన్ని సవాళ్లను అధిగమించి అంతర్జాతీయ వేదికపై దేశ ప్రతిష్ఠను నిలబెట్టారని, ఆయన విజయం కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తిగా నిలుస్తుందని అభినందించారు.







