Mahaa Daily Exclusive

  యూకే కేబినెట్‌లో భారత సంతతి నేతలకు చోటు. ఏఐ శాఖ మంత్రి కనిష్క నారాయణ్.

Share

లండన్, మహా.

యునైటెడ్ కింగ్‌డమ్ నూతన ప్రధాని ఆండీ బర్న్‌హామ్ తన తొలి మంత్రివర్గాన్ని ప్రకటించారు. ఈ కేబినెట్‌లో భారత సంతతికి చెందిన పలువురు నేతలకు కీలక బాధ్యతలు దక్కాయి. కనిష్క నారాయణ్‌కు కేబినెట్ హోదాతో కృత్రిమ మేధ (ఏఐ) శాఖ బాధ్యతలు అప్పగించగా, సత్వీర్ కౌర్‌కు మహిళలు, శిశు సంరక్షణ, భద్రత, సమానత్వ శాఖలను కేటాయించారు. హర్‌ప్రీత్ ఉప్పల్‌ను అసిస్టెంట్ గవర్న్‌మెంట్ విప్‌గా నియమించారు.

బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన కనిష్క నారాయణ్ 12 ఏళ్ల వయసులో కుటుంబంతో కలిసి యూకేకు వెళ్లారు. ఈటన్ కాలేజ్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించారు. 2024లో లేబర్ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన ఆయన, గతంలో సైన్స్ విభాగంలో అండర్ సెక్రటరీగా పనిచేశారు. తాజాగా ఏర్పాటు చేసిన ఏఐ శాఖతో పాటు వాణిజ్యం, సైన్స్ అండ్ ట్రేడ్‌కు సంబంధించిన కీలక బాధ్యతలు ఆయనకు అప్పగించారు.

కీర్ స్టార్మర్ ప్రభుత్వంలో సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేసిన లీసా నాండీకి అదే శాఖను బర్న్‌హామ్ తన కేబినెట్‌లోనూ కొనసాగించారు. మరో భారత సంతతి నాయకురాలు సత్వీర్ కౌర్‌కు మహిళలు, శిశు సంరక్షణ, భద్రత, సమానత్వ వ్యవహారాల శాఖలు అప్పగించారు. పంజాబ్ మూలాలు కలిగిన ఆమె 2024లో తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో పార్లమెంటరీ సెక్రటరీగా పనిచేసిన ఆమె, మాతృత్వ సెలవుల అనంతరం తిరిగి ప్రజా జీవితంలో చురుకుగా కొనసాగుతున్నారు.

హడ్డర్స్‌ఫీల్డ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హర్‌ప్రీత్ ఉప్పల్‌ను అసిస్టెంట్ గవర్న్‌మెంట్ విప్‌గా నియమించారు. పార్లమెంట్‌లో అధికార పార్టీ ఎంపీల కార్యకలాపాల సమన్వయం, క్రమశిక్షణ పర్యవేక్షణ బాధ్యతలను ఆమె నిర్వహించనున్నారు. భారత సంతతి నేతలకు వరుసగా కీలక పదవులు లభించడం యూకే రాజకీయాల్లో మరో ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నారు.