Mahaa Daily Exclusive

  ఆల్మట్టికి భారీ వరద. 19 గేట్లు ఎత్తి నీటి విడుదల.

Share

బళ్లారి, మహా.

నైరుతి రుతుపవనాల ప్రభావంతో కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కర్ణాటకలోని ఆల్మట్టి (లాల్‌బహదూర్ శాస్త్రి) జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ సీజన్‌లో తొలిసారిగా ప్రాజెక్టు 19 క్రస్ట్ గేట్లను ఎత్తి 84,611 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఆల్మట్టి నుంచి నీటి విడుదలతో దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ జలాశయాలకు వరద ప్రవాహం పెరిగే అవకాశముంది.

ప్రస్తుతం ఆల్మట్టి జలాశయంలో 106.939 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ఇది మొత్తం సామర్థ్యంలో 86.88 శాతానికి చేరింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో జలాశయానికి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇన్‌ఫ్లో లక్ష క్యూసెక్కులు దాటితే మిగిలిన క్రస్ట్ గేట్లను కూడా ఎత్తే అవకాశముందని తెలిపారు.

మరోవైపు తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. గురువారం నమోదైన 24,821 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో శుక్రవారం 19,250 క్యూసెక్కులకు తగ్గింది. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 1605.47 అడుగులకు చేరుకోగా, నీటి నిల్వ 29.471 టీఎంసీలుగా నమోదైంది. తాగునీటి అవసరాల కోసం కాలువల ద్వారా 3,189 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.