- ఎల్‌నినోలో రైతులకు అండగా నిలవండి.
- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
హైదరాబాద్, మహా.
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులకు అండగా నిలిచి సూక్ష్మ సాగునీటి వ్యవస్థల విస్తరణను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మైక్రో ఇరిగేషన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. డ్రిప్, తుంపర సేద్యమే నీటి కొరతను అధిగమించే సమర్థవంతమైన మార్గమని పేర్కొంటూ, పెండింగ్‌లో ఉన్న డ్రిప్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.
శనివారం తెలంగాణ సచివాలయంలో మైక్రో ఇరిగేషన్ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, డ్రిప్ వ్యవస్థల ఏర్పాటుకు అవసరమైన బీఎంఎస్, బీఓక్యూలను త్వరగా పూర్తి చేసి పరిపాలనా అనుమతుల కోసం వెంటనే పంపించాలని సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలనలు, పరిపాలనా అనుమతుల్లో ఎలాంటి జాప్యానికి తావివ్వొద్దని అధికారులను ఆదేశించారు.
డ్రిప్ సేద్యంతో తక్కువ నీరు, తక్కువ విద్యుత్ వినియోగంతోనే అధిక దిగుబడులు సాధించవచ్చని తుమ్మల తెలిపారు. రాష్ట్రంలో పంటల వైవిధ్యీకరణకు సూక్ష్మ సాగునీటి వ్యవస్థలు కీలకమని పేర్కొంటూ, ముఖ్యంగా ఆయిల్‌పామ్ సాగుకు డ్రిప్ సదుపాయాలను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీలకు సూచించారు.
రైతుల్లో అవగాహన పెంచే కార్యక్రమాల్లో మైక్రో ఇరిగేషన్ కంపెనీలు తప్పనిసరిగా భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని హామీ ఇచ్చారు. గత రెండేళ్లలో మైక్రో ఇరిగేషన్ కంపెనీలకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.400 కోట్లు చెల్లించిందని వెల్లడించారు.
కంపెనీల పనితీరును జిల్లాల వారీగా నిరంతరం సమీక్షిస్తామని మంత్రి స్పష్టం చేశారు. సూక్ష్మ సాగునీటి విస్తరణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవాలని, రైతులకు నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే ఆధునిక సాంకేతికతలను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.







