Mahaa Daily Exclusive

  సవాలును అవకాశంగా మలిచిన విద్యార్థులు.

Share

• పేపర్ లీక్‌లపై నిర్మలా సీతారామన్ స్పందన.

ఢిల్లీ, మహా.

పరీక్షల పేపర్ లీకేజీల వల్ల తొలుత తీవ్ర నిరాశకు గురైన విద్యార్థులు ఆ సవాలునే అవకాశంగా మలచుకుని మరింత మెరుగైన ప్రతిభ కనబర్చారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పేపర్ లీక్‌ల నేపథ్యంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవడంతో విద్యార్థుల భవిష్యత్తు రక్షించబడిందని ఆమె అన్నారు.

జంతర్‌మంతర్ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో వార్తా సంస్థ ఏఎన్‌ఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, మొదట్లో పేపర్ లీక్‌ల కారణంగా విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని, అయితే అనంతరం మరింత కష్టపడి చదివి పునఃపరీక్షల్లో మంచి ప్రతిభ కనబర్చామని పలువురు విద్యార్థులు చెప్పారని వివరించారు. ఈ పరిణామం వారి ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.

పరీక్షల పవిత్రతకు భంగం కలిగించిన వారిపై ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా స్పందించి కఠిన చర్యలకు ఆదేశించారని ఆమె తెలిపారు. నిందితుల అరెస్టులు, సకాలంలో పునఃపరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల ద్వారా విద్యార్థులు తమ ఉన్నత విద్యలో ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు సాగగలిగారని చెప్పారు.

పరీక్షల అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోందని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు, పేపర్లను లీక్ చేసిన, కొనుగోలు చేసిన నిందితులపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీక్ ఘటన అనంతరం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)లో సమగ్ర ప్రక్షాళన చేపట్టామని, ఇందులో భాగంగా ఇప్పటికే 47 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు.