Mahaa Daily Exclusive

  ధర్మేంద్రను తప్పించాల్సిందే.

Share

• శాఖ మార్పుతో సరిపోదు: రాహుల్

ఢిల్లీ, మహా.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను మరో శాఖకు మార్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్న వార్తలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. శాఖ మార్పుతో సమస్య పరిష్కారం కాదని, నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్‌ను పూర్తిగా పదవి నుంచి తప్పించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారని అన్నారు.

విద్యార్థులు ప్రభుత్వం ముందు మూడు ప్రధాన డిమాండ్లు ఉంచారని, అందులో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తొలి డిమాండ్ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న, అసమర్థతకు ప్రతీకగా మారిన వ్యక్తిని మరో శాఖకు బదిలీ చేయడం ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు అంగీకరించరని స్పష్టం చేశారు. ధ్వంసమైన విద్యార్థుల భవిష్యత్తుకు ఆయన ఒక సంకేతంగా నిలిచారని, అందుకే ఆయనను పదవి నుంచి తొలగించాల్సిందేనని అన్నారు.

సోమవారం విద్యార్థుల ర్యాలీ సందర్భంగా పోలీసులు పెల్లెట్ గన్స్, లాఠీచార్జ్‌కు పాల్పడిన ఘటనను కూడా రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఈ చర్యలకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశ విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మరోసారి కోరారు.

దేశ యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం అత్యంత బాధ్యతాయుతంగా చూడాలని రాహుల్ గాంధీ అన్నారు. విద్యార్థుల ఆందోళనలను అణచివేయడం కాకుండా, వారి ఆందోళనలకు కారణమైన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.