Mahaa Daily Exclusive

  అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్.

Share

అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్.

• అనారోగ్యంతోనూ ఉద్యమం కొనసాగింపు.

ఢిల్లీ, మహా.

నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేపడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు. తనకు టైఫాయిడ్ సోకినట్లు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించిన ఆయన, ప్రస్తుతం చికిత్స పొందుతున్నప్పటికీ ఉద్యమాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

ఇటీవల నిర్వహించిన రక్త పరీక్షల్లో టైఫాయిడ్ నిర్ధారణ అయినట్లు అభిజీత్ దీప్కే తెలిపారు. ప్రస్తుతం ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఇంట్రావీనస్ (ఐవీ) చికిత్స తీసుకుంటున్నానని చెప్పారు. ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోయినా విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం తీసుకురావాలనే లక్ష్యంతో చేపట్టిన ఉద్యమం ఆగబోదని పేర్కొన్నారు.

వీడియో సందేశంలో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా శాంతియుతంగా ఉద్యమానికి మద్దతు తెలిపిన కార్యకర్తలు, మద్దతుదారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వారి సహకారంతోనే ఈ ఉద్యమం విజయవంతమైందని పేర్కొంటూ, అందరికీ అభినందనలు తెలియజేశారు.

నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న తమ డిమాండ్ కొనసాగుతుందని అభిజీత్ దీప్కే పునరుద్ఘాటించారు. ఇదిలా ఉండగా, ఆయనతో పాటు పలువురు సీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు కూడా అనారోగ్యానికి గురైనట్లు సమాచారం.