• కేంద్రానికి చంద్రబాబు కృతజ్ఞతలు.
అమరావతి, మహా.
గుంతకల్–బళ్లారి మధ్య మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు తూర్పు–పడమర రైల్వే కారిడార్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు రాయలసీమ, ఉత్తర కర్ణాటక, గోవా ప్రాంతాల మధ్య రైల్వే అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ముఖ్యమంత్రి, ఈ కీలక ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కొత్త రైల్వే లైన్లతో ప్రస్తుతం ఉన్న రద్దీ తగ్గి, ప్రయాణికుల రాకపోకలు, సరుకు రవాణా మరింత వేగవంతం అవుతాయని తెలిపారు.
రూ.1,264 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో సుమారు రూ.600 కోట్లు ఆంధ్రప్రదేశ్‌లోనే ఖర్చు కానున్నాయని చంద్రబాబు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పారిశ్రామికాభివృద్ధికి ఊతమివ్వడంతో పాటు కృష్ణపట్నం, రాబోయే రామాయపట్నం పోర్టులకు రైల్వే అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా కొత్త ఆర్థిక అవకాశాలు ఏర్పడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో లక్షలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ప్రయోజనాలు కలుగుతాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల అభివృద్ధికి, రాష్ట్ర పురోగతిని వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిరంతర సహకారానికి మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.







