Mahaa Daily Exclusive

  పరీక్షల విశ్వసనీయతకు కేంద్రం పెద్దపీట.

Share

• లీకేజీలపై మరింత కఠిన చట్టం.

• తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు

హైదరాబాద్, మహా.

ప్రజా పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీలు, అక్రమాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చట్టాలను మరింత కఠినతరం చేస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు పరిరక్షణే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయత పెంపునకు వరుస సంస్కరణలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2024లో తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం దేశంలో ప్రజా పరీక్షల నిర్వహణకు చట్టపరమైన రక్షణ కల్పించిందన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో అనేక పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకైనప్పటికీ ఇలాంటి సమగ్ర చట్టాన్ని తీసుకురాలేదని విమర్శించారు.

రాధాకృష్ణ కమిటీ సిఫార్సుల మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)లో పలు సంస్కరణలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం, నిర్లక్ష్యానికి బాధ్యులైన 47 మంది అధికారులపై చర్యలు తీసుకుందని చెప్పారు. పరీక్షా వ్యవస్థలో ఎలాంటి అవకతవకలను సహించబోమనే సందేశాన్ని ప్రభుత్వం స్పష్టంగా ఇచ్చిందన్నారు.

ప్రస్తుతం ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేస్తూ పార్లమెంట్‌లో సవరణలు తీసుకువస్తున్నట్లు తెలిపారు. ప్రశ్నాపత్రాల లీకేజీ లేదా ఇతర అక్రమాలకు పాల్పడిన వారికి కనీసం పదేళ్ల జైలు శిక్షతో పాటు ప్రస్తుతం ఉన్న రూ.1 కోట్ల జరిమానాను రూ.15 కోట్ల వరకు పెంచే ప్రతిపాదన ఉందన్నారు. యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్, ఎన్‌టీఏతో పాటు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని ప్రజా పరీక్షలకు ఈ చట్టం వర్తిస్తుందని చెప్పారు.

పరీక్షా లీకేజీ కేసుల విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి, నాలుగు నెలల్లోపు దర్యాప్తు పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నట్లు రాంచందర్‌రావు వెల్లడించారు. ఇటీవల విద్యార్థి ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం సమస్యల పరిష్కారంలో సంభాషణకు ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యాన్ని చాటిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడే ఈ నిర్ణయాలను బీజేపీ తెలంగాణ శాఖ స్వాగతిస్తోందని, తెలంగాణ యువత కూడా ఈ సంస్కరణలను ఆదరిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.