ఆపరేషన్ విజయ్: మంచు కొండల్లో రగిలిన అగ్నిజ్వాల – ఈ సాహస గాథ
(శివకుమార్ గనివాడ, సీనియర్ సామాజిక విశ్లేషకులు)
సముద్ర మట్టానికి 16,000 నుండి 18,000 అడుగుల ఎత్తు, రక్తాన్ని గడ్డకట్టించే మైనస్ పదిహేను డిగ్రీల టెంపరేచర్… శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉండే ఆ భీకరమైన మంచు కొండల్లో, ఒక దేశం తన ఉనికిని చాటుకునేందుకు చేసిన ప్రాణత్యాగాల వీర గాథే ఈ కార్గిల్ వార్. 1998-1999 వింటర్ లో అప్పుడే పాకిస్తాన్-భారత్ మధ్య శాంతి కోసం లాహోర్ అగ్రిమెంట్ కుదిరింది. కానీ, ఆ అగ్రిమెంట్ కేవలం ఒక నాటకం మాత్రమేనని అప్పుడు ఎవరికీ తెలియదు. కాశ్మీర్ మరియు లడఖ్ మధ్య ఉన్న జీవనాడి లాంటి నేషనల్ హైవేని కట్ చేసి, ద్రాస్, బటాలిక్ సెక్టార్లను ఆక్రమించి, భారత దళాలను సియాచిన్ గ్లేసియర్ నుండి తరిమెయ్యాలనేది పాక్ ప్లాన్. టెర్రరిస్ట్స్ ముసుగులో పాక్ సైన్యం నియంత్రణ రేఖను (లైన్ ఆఫ్ కంట్రోల్) దాటి ఎత్తైన శిఖరాలపై తిష్టవేసింది, ఆ కుట్ర పేరే ఆపరేషన్ బదర్. మే 3, 1999న స్థానిక గొర్రెల కాపరులు కొండలపై గుర్తుతెలియని కదలికలను పసిగట్టారు, అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని కెప్టెన్ సౌరభ్ కాలియా నేతృత్వంలో ఒక పెట్రోలింగ్ టీమ్ అక్కడికి వెళ్ళింది. కానీ ఊహించని విధంగా పాక్ బలగాలు వారిని బంధించి, దారుణంగా హింసించి చంపేశాయి. ఆ వీరుల డెడ్ బాడీస్ ని చూసిన తర్వాత భారత సైన్యానికి అర్థమైంది, శత్రువులు సాధారణ ఉగ్రవాదులు కారు, అత్యంత శిక్షణ పొందిన పాకిస్తాన్ రెగ్యులర్ ఆర్మీ అని! ఆ క్షణమే భారత సింహం గర్జించింది, ఆపరేషన్ విజయ్ మొదలైంది.
శత్రువులు ఎత్తైన శిఖరాలపై బంకర్లలో ఉన్నారు, మనవాళ్లు కింద నుంచి పైకి ఎక్కుతూ అటాక్ చేయాలి. ఇది మృత్యువుతో ఆడుకునే భయంకరమైన ఆట. మే 26న ఎయిర్ ఫోర్స్ ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ పేరుతో రంగంలోకి దిగి మిగ్-21, మిగ్-27, మిరాజ్ 2000 ఫైటర్ జెట్స్ నింగిలో మృత్యుదేవతల్లా చక్కర్లు కొడుతూ శత్రు స్థావరాలపై బాంబుల వర్షం కురిపించగా, నేవీ ‘ఆపరేషన్ తల్వార్’ పేరుతో అరేబియా సముద్రంలో పాకిస్తాన్ ఓడరేవులను దిగ్బంధించి వారి సప్లై చెయిన్ ని కట్ చేసి ఊపిరి ఆడకుండా చేసింది. దీనికి తోడు బంకర్లను ఛేదించడానికి భారత ఆర్టిలరీ ప్రయోగించిన బోఫోర్స్ తుపాకులు శత్రువుల వెన్నులో వణుకు పుట్టించాయి. ప్రాణాలను పణంగా పెట్టి, శత్రువుల బుల్లెట్స్ వర్షాన్ని ఎదుర్కొంటూ జూన్ 13న భారత సైన్యం ‘తోలోలింగ్’ శిఖరాన్ని తిరిగి తమ ఆధీనంలోకి తీసుకోవడం ఈ యుద్ధంలో ఒక టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత జూలై 4న అత్యంత వ్యూహాత్మకమైన టైగర్ హిల్ పై పదకొండు గంటల పాటు జరిగిన భీకర రక్తపాతం తర్వాత, శత్రువులను చీల్చిచెండాడి మన మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.
ఈ యుద్ధం నలుగురు సూపర్ హీరోస్ ని ప్రపంచానికి పరిచయం చేసింది, వారి అత్యున్నత సాహసాలకు భారత ప్రభుత్వం ‘పరమ వీర చక్ర’ను ప్రదానం చేసింది. పాయింట్ 5140, 4875 లను కైవసం చేసుకునే మిషన్ లో తుపాకీ బుల్లెట్స్ దూసుకొస్తున్నా భయపడకుండా శత్రువులను మట్టుబెడుతూ “యే దిల్ మాంగే మోర్” అని గర్జించిన కెప్టెన్ విక్రమ్ బాత్రా, తీవ్ర గాయాలైనప్పటికీ వెనక్కి తగ్గకుండా పోరాడి నేలకొరిగిన లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండేల త్యాగాలు మరువలేనివి. అలాగే ఒంటిపై చాలాచోట్ల గాయాలై రక్తం పారుతున్నా ఒంటరిగా శత్రువుల పైకి దూకి వారిని నాశనం చేసిన గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్, ఏరియా ఫ్లాట్ టాప్‌ను స్వాధీనం చేసుకునే క్రమంలో శత్రువుల ఆయుధాలనే లాక్కొని వారిని మట్టుబెట్టిన రైఫిల్ మ్యాన్ సంజయ్ కుమార్ల సాహసం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. క్షేత్ర స్థాయిలో సైన్యం శత్రువులను చంపుతుంటే, డిప్లొమాటిక్ లెవెల్ లో భారత ప్రభుత్వం పాకిస్తాన్ పరువు తీసింది, పాక్ అధికారుల ఫోన్ టేపులను ప్రపంచం ముందు పెట్టి అంతర్జాతీయంగా వారిని ఏకాకిని చేసింది. సుమారు అరవై రోజుల ఉత్కంఠభరిత పోరాటం తర్వాత జూలై 26, 1999న భారత భూభాగం నుండి చివరి చొరబాటుదారుడిని కూడా తరిమికొట్టామని ఆర్మీ ప్రకటించింది. కానీ ఈ విజయానికి మనం చెల్లించిన మూల్యం చాలా పెద్దది, మన మాతృభూమి కోసం 527 మంది సైనికులు వీరమరణం పొందగా, 1,363 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి ముప్పు రాకుండా ఉండాలని మన సెక్యూరిటీ సిస్టమ్స్ మరింత కట్టుదిట్టం చేసుకున్నాం. మనకు ప్రశాంతమైన నిద్రను బహుమతిగా ఇవ్వడానికి మంచు కొండల్లో తమ నెత్తురు చిందించిన ఆ వీర జవాన్ల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి కనీస బాధ్యత, వారి డెడికేషన్, దేశభక్తి భావితరాలకు ఎప్పటికీ ఆదర్శం… జై హింద్!





