*ఖండాంతర ముప్పు – మారాల్సిన వ్యవసాయం: ‘సూపర్ ఎల్ నినో’ సవాలును జయించే స్మార్ట్ సాగు వ్యూహాలు!*
(శివ కుమార్ గనివాడ, సీనియర్ వ్యవసాయ, వాణిజ్య నిపుణులు,9951715215)
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ప్రపంచ వాతావరణ వ్యవస్థలో వస్తున్న మార్పులు భారతీయ వ్యవసాయ రంగానికి పెను సవాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా ఎల్ నినో తీవ్రరూపం దాల్చడం, అది ‘సూపర్ ఎల్ నినో’గా మారే అవకాశాలు ఉండటంతో నైరుతి రుతుపవనాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఎల్ నినో అనేది మధ్య మరియు తూర్పు భూమధ్యరేఖ పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే వేడిగా మారే ఒక వాతావరణ దృగ్విషయం. ఇది ‘ఎల్ నినో-సదరన్ ఆసిలేషన్’ (ఈ.ఎన్.ఎస్.ఓ.) చక్రంలో ఒక ఉష్ణ దశ. సాధారణంగా ఇది ప్రతి రెండు నుండి ఏడు సంవత్సరాలకు ఒకసారి సంభవించి, తొమ్మిది నుండి పన్నెండు నెలల వరకు కొనసాగుతుంది. ఎల్ నినో సమయంలో పసిఫిక్ సముద్రంలో తూర్పు నుండి పడమరకు వీచే వాణిజ్య పవనాలు బలహీనపడతాయి లేదా దిశ మారుతాయి. దీనివల్ల వేడి నీరు ఆస్ట్రేలియా వైపు వెళ్లకుండా దక్షిణ అమెరికా తీరం వద్ద నిలిచిపోతుంది. ఈ వేడెక్కిన సముద్ర ఉపరితలం ప్రపంచ వాతావరణం, ఉష్ణోగ్రతలు మరియు వర్షపాత సరళిని పూర్తిగా మారుస్తుంది. భారత్ విషయానికొస్తే, ఇది తూర్పు రుతుపవనాల ప్రవాహాన్ని బలహీనపరిచి వర్షపాతాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూ.ఎం.ఓ.) గ్లోబల్ సీజనల్ క్లైమేట్ అప్డేట్ ప్రకారం, 2026 మధ్య నాటికి ఉష్ణమండల పసిఫిక్ ప్రాంతంలో ప్రారంభమయ్యే ఈ ఎల్ నినో రాబోయే రోజుల్లో తీవ్రరూపం దాల్చనుంది. అత్యంత కీలకమైన ‘నినో 3.4’ ప్రాంతంలో సముద్ర ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఎల్ నినో 2026 చివరి నుండి 2027 ప్రారంభం వరకు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు, వరుసగా రెండేళ్లు ఇలా ఉండటం చాలా అరుదు. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం తోడుకావడంతో, భారత చరిత్రలో అత్యంత వేడి సంవత్సరంగా నమోదైన 2024 రికార్డును 2026 అధిగమించే ముప్పు ఉంది. భారతదేశంలో 52 శాతం సాగు భూమి వర్షాధారమే కావడం వల్ల రుతుపవనాల్లో వచ్చే ఈ మార్పు వ్యవసాయాన్ని తీవ్ర ప్రమాదంలో పడేస్తుంది. భారత వాతావరణ శాఖ (ఐ.ఎం.డి.) మరియు క్లైమేట్ ట్రెండ్స్ నివేదికల ప్రకారం, జూన్ నెలలో ఇప్పటికే వర్షపాతం లోటుగా నమోదైంది. జూలై నుండి సెప్టెంబర్ వరకు ఎల్ నినో మరింత బలపడే అవకాశం ఉన్నందున, మిగిలిన సీజన్లోనూ వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం హిందూ మహాసముద్ర ద్విధ్రువం (ఐ.ఓ.డి-ఇండియన్ ఓషన్ డైపోల్) తటస్థంగా ఉండటం వల్ల ఇది పసిఫిక్ నుండి వచ్చే పొడి వాతావరణాన్ని అడ్డుకునే స్థితిలో లేదు.
గత 22 ఎల్ నినో సంవత్సరాలను విశ్లేషిస్తే, ఆదిలాబాద్ జిల్లా మినహా తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో నైరుతి రుతుపవనాల సమయంలో మొత్తంమీద సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో కొన్ని జిల్లాల్లో సుదీర్ఘ పొడి విరామాలు (డ్రై స్పెల్స్) వచ్చాయి. సెప్టెంబర్ నెలలో మాత్రం ఐ.ఓ.డి. లేని సంవత్సరాల్లో దాదాపు అన్ని జిల్లాల్లో వర్షపాత లోటు కనిపించింది. 2026 తెలంగాణ వర్షపాత అంచనాలను గమనిస్తే, జూన్ నెలలో సాధారణం నుండి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉన్నా, జూలై మరియు ఆగస్టు నెలల్లో పొడి విరామాలు రావచ్చు. ముఖ్యంగా ఉత్తర మరియు దక్షిణ తెలంగాణలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం, మధ్య తెలంగాణలో సాధారణం లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల వరి, పప్పుధాన్యాలు, నూనెగింజలు, మొక్కజొన్న, పత్తి వంటి ఖరీఫ్ పంటలు విత్తే దశలోనే మరియు ఎదుగుదల సమయంలో నీరు లేక దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. పెరుగుతున్న ఇంధన ధరలు, ఎరువుల కొరతతో పాటు జలాశయాల్లో నీటిమట్టం తగ్గి భూగర్భ జలాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఆహార ఉత్పత్తి తగ్గడం వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి దేశంలో ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం దేశంలోని దాదాపు 200 జిల్లాలను అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించి ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.
ఈ అస్థిర వర్షపాత పరిస్థితుల్లో రైతులు నష్టాలను నివారించుకోవడానికి పంటల వైవిధ్యీకరణను (క్రాప్ డైవర్సిఫికేషన్) పాటించడం అత్యంత ఆవశ్యకం. పూర్తిగా ఒకే పంటపై ఆధారపడకుండా కంది, పెసర, మినుము, మొక్కజొన్న, జొన్న, సజ్జ, కొర్రలు, ఆముదాలు వంటి తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం మేలు. ప్రధాన పంటతో పాటు మరొక పంట వేయడం (అంతర పంటలు) ద్వారా ఒక పంట విఫలమైనా మరొకటి ఆర్థిక రక్షణనిస్తుంది. ఇప్పటికే జూలై 15 దాటినా తగినంత వర్షాలు పడనందున, వరి రైతులు ఎక్కువ నీరు అవసరమయ్యే వరి నాటు వేయడానికి బదులుగా 125 రోజుల లోపు పండే బతుకమ్మ, ఎం.టి.యు. 1010, ఐ.ఆర్. 64, కె.ఎన్.ఎం.-118, జె.జి.ఎల్.-24423 వంటి స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలి. అలాగే నీటి ఎద్దడిని, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే విత్తనాలను మాత్రమే వాడాలి. నేలలో తేమను నిల్వ చేయడానికి ఎత్తైన మడుల సాగు పద్ధతిని అనుసరించాలి. నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేస్తూ నేరుగా వేర్లకే నీరందించే బిందు సేద్యం (డ్రిప్ ఇరిగేషన్) ఉపయోగించడం చాలా ఉత్తమం. కరువు సమయంలో పశువుల మేత కొరత రాకుండా ముందుగానే పశుగ్రాసాన్ని పెంచడం లేదా నిల్వ చేసుకోవాలి. తీవ్రమైన ఎండ వేడిమి నుంచి కోళ్లను కాపాడటానికి షెడ్లలో గాలి వెలుతురు సరిగా ఉండేలా చూసి, కప్పులపై గడ్డి వేసి ఉష్ణోగ్రతను తగ్గించాలి. పంటలతో పాటు పాడి, కోళ్ల పెంపకం వంటి అనుబంధ రంగాలను కలిపి సమీకృత వ్యవసాయం చేయడం ద్వారా ప్రతికూల వాతావరణంలోనూ రైతులు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించవచ్చు. నెలలవారీ వాతావరణ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలి.






