రాష్ట్రీయతతోనే దేశాభివృద్ధి.
* వైద్యుల సేవలు సమాజానికి అమూల్యం.
* బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు.
హైదరాబాద్, మహా.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, జాతీయ భావనతో కూడిన అభివృద్ధి విధానాల ద్వారానే దేశం సమగ్ర ప్రగతి సాధిస్తుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు అన్నారు. వైద్యులు అందించే సేవలు వ్యక్తుల ఆరోగ్యానికే పరిమితం కావని, సమాజం, దేశ నిర్మాణానికి కీలకమైనవని పేర్కొన్నారు. బీజేపీ డాక్టర్స్ సెల్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన పలు అంశాలపై మాట్లాడారు.
దేశ ఆరోగ్య రంగానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాంచందర్‌రావు తెలిపారు. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ద్వారా జిల్లా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానలకు వేల కోట్ల రూపాయల నిధులు అందిస్తున్నట్లు చెప్పారు. మందులు, వైద్య పరికరాలు, సిబ్బంది వేతనాల వరకు అవసరమైన నిధుల్లో అధిక భాగాన్ని కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తోందని పేర్కొన్నారు.
కోవిడ్ మహమ్మారి సమయంలో స్వదేశీ వ్యాక్సిన్ అభివృద్ధిలో భారత్ బయోటెక్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అందించిన ప్రోత్సాహం కీలకపాత్ర పోషించిందని ఆయన అన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కేవలం పరిశుభ్రతకే పరిమితం కాకుండా ‘స్వస్థ్ భారత్’ లక్ష్య సాధనకు బలమైన పునాదిగా నిలిచిందని చెప్పారు. ఖేలో ఇండియా, అంతర్జాతీయ యోగా దినోత్సవం వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెరిగిందని అభిప్రాయపడ్డారు.
సామాజిక మాధ్యమాల్లో, ముఖ్యంగా వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల్లో ప్రచారంలోకి వచ్చే అనధికారిక వైద్య సలహాలు, చిట్కాలను నమ్మి ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుకోవద్దని ప్రజలకు సూచించారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు అర్హత కలిగిన వైద్యుల సలహాలు మాత్రమే తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశ సరిహద్దుల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు రాంచందర్‌రావు ఘన నివాళులు అర్పించారు. దేశభక్తి, జాతీయ భావన యువతలో మరింత బలపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశ భద్రత, సమగ్రతను కాపాడడంలో సాయుధ దళాల త్యాగాలను ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.
ఇజ్రాయెల్ వంటి చిన్న దేశాలు జాతీయ భావం, పరిశోధనలకు ప్రాధాన్యం, సైనిక శిక్షణ, ఆధునిక వైద్య వ్యవస్థలతో ప్రపంచంలో శక్తివంతమైన దేశాలుగా ఎదిగాయని రాంచందర్‌రావు గుర్తుచేశారు. సోషలిజం, కమ్యూనిజం, క్యాపిటలిజం కంటే రాష్ట్రీయత ద్వారానే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.
సమాజ ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న వైద్యులకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలియజేశారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సేవలందిస్తున్న ప్రతి వైద్యుడు సమాజానికి విలువైన ఆస్తి అని కొనియాడారు.








