Mahaa Daily Exclusive

  దళిత ప్రజాప్రతినిధుల ఆవేదన…

Share

దళిత ప్రజాప్రతినిధుల ఆవేదన.
* భట్టి ఎదుట గోడు వెల్లగక్కిన ఎమ్మెల్యేలు.

హైదరాబాద్, మహా.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో దళిత ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం దక్కడం లేదంటూ పలువురు ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాలు, అధికారుల బదిలీలు వంటి కీలక విషయాల్లో తమను పూర్తిగా పక్కన పెడుతున్నారని వాపోయారు. ప్రజాభవన్‌లో ఎస్సీ ప్రజాప్రతినిధుల సంఘం చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ, కన్వీనర్ మల్లు రవి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి.

సమావేశంలో మాట్లాడిన దళిత ప్రజాప్రతినిధులు, తమ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి పర్యటనల వివరాలు, అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల గురించి ముందస్తు సమాచారం కూడా ఇవ్వడం లేదని భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తమకు తగిన ప్రాధాన్యం లేకపోవడం వల్ల ప్రజల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

డివిజన్, మండల స్థాయి అధికారుల బదిలీలు, కొత్త అధికారుల నియామకాలు కూడా తమకు తెలియకుండా జరుగుతున్నాయని సమావేశంలో ఆవేదన వ్యక్తమైంది. ప్రభుత్వ శాఖల కార్యదర్శులను కలిసి సమస్యలు వివరించాలన్నా అపాయింట్‌మెంట్ కూడా దొరకడం లేదని పలువురు సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం, ప్రాధాన్యం కల్పించడం అవసరమని వారు అభిప్రాయపడ్డారు. ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి రూ.10 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించాలని భట్టి విక్రమార్కను కోరారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెరుగుతోందని, దానిని వెంటనే అరికట్టకపోతే ప్రభుత్వానికే రాజకీయంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఈ సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గంలో చోటుచేసుకున్న పరిణామాలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. పార్టీ నాయకుల మధ్య ఉన్న విభేదాలను బహిరంగంగా ప్రదర్శించడం వల్ల పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుందని భట్టి విక్రమార్క సూచించినట్లు సమాచారం. అంతర్గత సమస్యలను పార్టీ వేదికలపైనే చర్చించి పరిష్కరించుకోవాలని, ప్రజల ముందుకు విభేదాలు తీసుకురావద్దని నాయకులకు ఆయన సూచించినట్లు సమావేశంలో పాల్గొన్న వారు తెలిపారు.