Mahaa Daily Exclusive

  కొండకర్ల ఆవకు పరిరక్షణ హోదా…

Share

కొండకర్ల ఆవకు పరిరక్షణ హోదా.
• చిత్తడి నేలల సంరక్షణ వేగవంతం.
• డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

అమరావతి, మహా .
రాష్ట్రంలోని చిత్తడి నేలల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి, అటవీ-పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. అనకాపల్లి జిల్లాలోని జీవ వైవిధ్యానికి నిలయమైన కొండకర్ల ఆవను ‘పరిరక్షణ నిల్వ’ (కన్జర్వేషన్ రిజర్వ్) ప్రాంతంగా గుర్తించే ప్రక్రియను వేగవంతం చేసినట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా చిత్తడి నేలలను గుర్తించి, వాటి సంరక్షణకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 ప్రకారం కొండకర్ల ఆవ చిత్తడి నేలను కన్జర్వేషన్ రిజర్వ్‌గా ప్రకటించేందుకు అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌వోసీ) జారీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినట్లు తెలిపారు. అటవీశాఖ ప్రతిపాదనలకు జలవనరుల శాఖ కూడా ఆమోదం తెలిపిందన్నారు. సాగునీరు, జలాశయాల నిర్వహణ, హైడ్రాలిక్ వ్యవస్థలు, ఇతర ప్రజాప్రయోజన కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా అవసరమైన రక్షణ చర్యలతో ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

కొండకర్ల ఆవ జీవ వైవిధ్యానికి ప్రధాన కేంద్రంగా నిలిచిందని, వలస మరియు స్థానిక పక్షులకు ఇది ముఖ్యమైన ఆవాసమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని శాస్త్రీయంగా సర్వే చేసి ఎకో-టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా శాస్త్రీయ అధ్యయనాలు, క్షేత్రస్థాయి పరిశీలనల ఆధారంగా ఇప్పటికే 950 చిత్తడి నేలలను గుర్తించినట్లు ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. వీటిని దశలవారీగా నోటిఫై చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తొలి దశలో 16 చిత్తడి నేలల నోటిఫికేషన్‌కు సంబంధించిన అనుమతుల ప్రక్రియ తుది దశకు చేరుకుందని తెలిపారు.

చిత్తడి నేలలు జీవ వైవిధ్య పరిరక్షణకు మాత్రమే కాకుండా భూగర్భ జలాల పునరుద్ధరణ, వరదల నియంత్రణ, జల భద్రత, వాతావరణ మార్పుల ప్రభావాల తగ్గింపులో కీలక పాత్ర పోషిస్తాయని పవన్ కళ్యాణ్ వివరించారు. స్థానిక ప్రజల జీవనోపాధి మెరుగుదలకు కూడా ఇవి దోహదపడతాయని పేర్కొన్నారు. అందుకే చిత్తడి నేలల సంరక్షణను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణిస్తోందన్నారు.

అర్హత కలిగిన అన్ని చిత్తడి నేలలను నోటిఫై చేసే ప్రక్రియను సంబంధిత శాఖల సమన్వయంతో వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. సంయుక్త సర్వేలు త్వరితగతిన పూర్తి చేసి, చట్టపరమైన అనుమతులను నిర్దిష్ట గడువులో పొందాలని ఆదేశించారు. అదే సమయంలో ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

చిత్తడి నేలలపై జరుగుతున్న ఆక్రమణలు, విధ్వంసక చర్యల పట్ల కఠినంగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. చిత్తశుద్ధితో చిత్తడి నేలల పరిరక్షణ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వం, పర్యావరణ పరిరక్షణతో పాటు ఎకో-టూరిజం అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. కొండకర్ల ఆవను పర్యావరణ పరిరక్షణకు ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.