Mahaa Daily Exclusive

  స్వేచ్ఛా వాణిజ్యంతో దేశీయ వ్యవసాయాన్ని దెబ్బ..

Share

  • స్వేచ్ఛా వాణిజ్యంతో దేశీయ వ్యవసాయాన్ని దెబ్బ
  • జూలై 28న న్యూఢిల్లీలో సంయుక్త కిసాన్ మోర్చా అఖిల భారత సదస్సు
  • రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి శోభన్

కారేపల్లి, మహా : భారత్-అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎప్.టీ.ఏ) తో దేశీయ వ్యవసాయాన్ని కొలుకోని దెబ్బ తగులుతుందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి మూడ్ శోభన్ అన్నారు. ఆదివారం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్.కే.ఎం) ఆధ్వర్యంలో జూలై 28న న్యూఢిల్లీలోని కె.ఎస్. ఆడిటోరియం లో జరిగే అఖిల భారత సదస్సు బయలుదేరి వెళ్తు విలేకరులతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రైతాంగం, కార్మికుల ఉనికికి ప్రమాదకరంగా మారాయన్నారు. దేశీయంగా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే అన్ని రకాల ఎఫ్.టీ.ఏ (స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం) లను రద్దు చేయాలని, ఎం.ఎస్. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం సీ2+50% సూత్రం ఆధారంగా అన్ని పంటలకూ కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్టపరమైన హామీ కల్పించాలన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సమగ్రమైన వ్యవసాయ విధానం అమలు చేయకపోవడంతో గ్రామీణ రుణభారం పెరిగి రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్ 2020లో చారిత్రాత్మక రైతాంగ పోరాటానికి బీజం వేసినప్పటి నుండి, మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై ఎస్కెఎం నిరంతరం పోరాడుతోందన్నారు. డిసెంబర్ 9, 2021న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లిఖితపూర్వక హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలేదన్నారు. గ్రామీణ రుణభారాన్ని, రైతుల ఆత్మహత్యలను నివారించడానికి సమగ్ర వ్యవసాయ రుణమాఫీ ప్రకటించాలని, రైతు వ్యతిరేక విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు – 2025, విత్తన బిల్లు – 2025లను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మోడీ అధికార పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి బలవంతపు భూసేకరణలు, కార్పొరేట్ భూ సమీకరణలు పెరిగాయన్నారు. 2006 అటవీ హక్కుల చట్టం (ఎఫ్ఆర్ఎ) ప్రకారం గిరిజనులు, అటవీ నివాసుల భూ హక్కులను పరిరక్షించాలన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన చారిత్రాత్మక రైతు పోరాటం సందర్భంగా రైతులపై నమోదు చేసిన అన్ని కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని, కార్మికులను బానిసలుగా మార్చే 4 కార్మిక కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ నెలకు రూ. 31వేలు కనీస వేతన చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని, ఉపాధి హామీ (ఎంఎన్ఆర్ఈజీఏ) పథకాన్ని పునరుద్ధరించి, ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 200 రోజుల పని, రోజుకు రూ.700 వేతనం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తుందన్నారు. రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్.కే.ఎం) ఆధ్వర్యంలో జూలై 28న న్యూఢిల్లీ లో అఖిల భారత సదస్సు జరుగుతుందన్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో దేశవ్యాప్తంగా ఉన్న ఎస్కెఎం అనుబంధ సంఘాల నుంచి దాదాపు వెయ్యి మంది ప్రతినిధులు పాల్గొంటారన్నారు. రైతాంగం, కార్మికుల ఉనికిని కాపాడుకోవడానికి, వారి హక్కులను సాధించుకోవడానికి రాబోయే రోజుల్లో చేపట్టబోయే పోరాటాలకు ఈ అఖిల భారత సదస్సు ఒక దిశానిర్దేశం చేయనుందని తెలిపారు.