Mahaa Daily Exclusive

  పరీక్షల వ్యవస్థలో భారీ సంస్కరణలకు కేంద్రం…

Share

పరీక్షల వ్యవస్థలో భారీ సంస్కరణలకు కేంద్రం..
* నందన్ నిలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు.
హైదరాబాద్, మహా.
దేశవ్యాప్తంగా వివిధ జాతీయ స్థాయి పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నీట్, సీబీఎస్‌ఈ తదితర పరీక్షల నిర్వహణపై తలెత్తిన వివాదాల అనంతరం పరీక్షల వ్యవస్థలో సమూల సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించిన కేంద్రం, ప్రపంచ ప్రఖ్యాత సాంకేతిక నిపుణుడు నందన్ నిలేకని నాయకత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటిస్తూ, దేశంలోని కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు, వారి కష్టానికి తగిన న్యాయం చేయడం తమ ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.

విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కీలక చర్యలు తీసుకుంటోందని ప్రధాని పేర్కొన్నారు. పరీక్షల అక్రమాలకు పాల్పడి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడినవారిపై ఇప్పటికే కఠిన చర్యలు తీసుకున్నామని, అలాంటి శక్తులు ప్రస్తుతం జైలు గోడల మధ్య ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశామని, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో మరింత కఠినమైన చట్టపరమైన నిబంధనలను తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని వెల్లడించారు.

పరీక్షల నిర్వహణలో ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించాలంటే అత్యాధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో నందన్ నిలేకని నాయకత్వంలోని టాస్క్‌ఫోర్స్ ప్రశ్నాపత్రాల భద్రత, లీకేజీల నివారణ, డిజిటల్ భద్రతా వ్యవస్థలు, పరీక్షల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, మూల్యాంకన ప్రక్రియలో పారదర్శకత వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగా పరీక్షల నిర్వహణలో విస్తృత సంస్కరణలు అమలు చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.

ఈ ఉన్నత స్థాయి కమిటీలో నందన్ నిలేకనితో పాటు ఇస్రో మాజీ ఛైర్మన్ ఎస్. సోమనాథ్, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ దేకా, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి, కేంద్ర మాజీ విద్యాశాఖ కార్యదర్శి అనితా కర్వాల్, లాజిస్టిక్స్ నిపుణుడు అమృత్ లాల్ మీనా సభ్యులుగా ఉన్నారు. దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లను సమగ్రంగా పరిశీలించి, భవిష్యత్తులో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా బలమైన సాంకేతిక, పరిపాలనా వ్యవస్థను రూపొందించడమే ఈ టాస్క్‌ఫోర్స్ ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రత, విశ్వసనీయతకు కొత్త ప్రమాణాలు తీసుకురావాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోట్లాది మంది విద్యార్థుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. నందన్ నిలేకని నేతృత్వంలోని ఈ టాస్క్‌ఫోర్స్ సిఫార్సులు దేశంలోని పోటీ పరీక్షల వ్యవస్థను మరింత ఆధునికంగా, నమ్మకంగా మార్చే దిశగా కీలక మలుపు అవుతాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.