జెన్‌జీలకు మంత్రి పదవులు ఇవ్వండి.
* రేవంత్‌కు బండి సంజయ్ సవాల్
• మాటలు కాదు.. ఆచరణలో చూపించండి.
• ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించి యువతకు అవకాశం కల్పించాలని డిమాండ్.
హైదరాబాద్, మహా.
తెలంగాణలో యువతకు అవకాశాలు కల్పిస్తామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తన మాటలను ఆచరణలో నిరూపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. నిజంగా యువతకు ప్రాధాన్యం ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించి జెన్‌జీలకు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న హోం, విద్య, మున్సిపల్ శాఖలను యువ నాయకులకు అప్పగించాలని సూచించారు.
ఆదివారం శంషాబాద్ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడిన బండి సంజయ్, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జెన్‌జీలకు అవకాశాలు ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్, ఆచరణలో మాత్రం వయసు పైబడిన నాయకులకే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి దృష్టిలో జెన్‌జీలు అంటే వీ. హనుమంతరావు (వీహెచ్), కె. కేశవరావు (కేకే), కోదండరెడ్డి వంటి సీనియర్ నేతలేనని ఎద్దేవా చేశారు. వృద్ధులకు, వయసు దాటిన పెద్దలకు ‘యూత్ కోటా’ పేరుతో పదవులు ఇవ్వడం కాంగ్రెస్‌కు అలవాటైందని వ్యాఖ్యానించారు.
యువతకు నిజమైన ప్రాధాన్యం ఇవ్వాలంటే రాజకీయ సంకల్పం అవసరమని, కేవలం ప్రకటనలతో సరిపెట్టకుండా అధికారంలో భాగస్వామ్యం కల్పించాలని బండి సంజయ్ అన్నారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు.
భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం దేశ ప్రయోజనాలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. “బీజేపీకి దేశం ఫస్ట్, పార్టీ నెక్ట్స్, పర్సన్ లాస్ట్” అనే సిద్ధాంతంతోనే పార్టీ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. అదే విలువలను పాటిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారని, వ్యక్తుల కంటే దేశ ప్రయోజనాలే బీజేపీకి ముఖ్యమని ఆయన అన్నారు.








