కామన్వెల్త్‌లో భారత్‌కు తొలి స్వర్ణం.
* మీరాబాయి చాను చరిత్ర.
* వరుసగా మూడోసారి గోల్డ్ మెడల్.
గ్లాస్గో,మహా.
కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత్ స్వర్ణ ఖాతా తెరిచింది. స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను మహిళల 48 కిలోల విభాగంలో అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. కామన్వెల్త్ క్రీడల్లో వరుసగా మూడోసారి స్వర్ణ పతకం సాధిస్తూ తన ఆధిపత్యాన్ని మరోసారి చాటిన చాను, రెండు గేమ్స్ రికార్డులు నెలకొల్పి భారత క్రీడాభిమానులను ఆనందంలో ముంచెత్తింది.
పోటీల్లో ఆరంభం నుంచే ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన మీరాబాయి చాను స్నాచ్ విభాగంలో 85 కిలోల బరువును విజయవంతంగా ఎత్తి కొత్త గేమ్స్ రికార్డు సృష్టించింది. అనంతరం క్లీన్ అండ్ జర్క్‌లో 105 కిలోలు లిఫ్ట్ చేసి తన సత్తా చాటింది. మొత్తంగా 190 కిలోల బరువును ఎత్తి మరో గేమ్స్ రికార్డును తన పేరిట లిఖించుకుంటూ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
ఈ విభాగంలో నైజీరియాకు చెందిన రూత్ అసుక్వో న్యోంగ్ మొత్తం 168 కిలోలు ఎత్తి రజత పతకం సాధించగా, మలేసియాకు చెందిన ఐరీన్ జేన్ హెన్రీ 167 కిలోలతో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. అయితే చాను ప్రదర్శనకు వారిద్దరూ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు.
ఇదిలా ఉండగా, వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు ఇదే రోజున రెండో పతకం కూడా లభించింది. అంతకుముందు పురుషుల 60 కిలోల విభాగంలో భారత వెయిట్‌లిఫ్టర్ రిషికంఠ సింగ్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్ల విజయపరంపర కొనసాగుతుండగా, రానున్న రోజుల్లో మరిన్ని పతకాలు సాధిస్తారనే ఆశలు క్రీడాభిమానుల్లో నెలకొన్నాయి.








