మార్కెట్ కమిటీల్లో ప్రత్యేక తనిఖీలు.
* రైతులకు గిట్టుబాటు ధరలే లక్ష్యం.
* రాష్ట్రవ్యాప్తంగా ఆరు ప్రత్యేక బృందాలు.
* రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
హైదరాబాద్, మహా.
రైతుల ప్రయోజనాల పరిరక్షణతో పాటు వ్యవసాయ మార్కెట్లలో పారదర్శక వ్యవస్థను బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల పనితీరును సమగ్రంగా పరిశీలించేందుకు ఆరు ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ వారంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మార్కెట్ కమిటీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, రైతులకు అందుతున్న సేవలు, మార్కెట్ నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నట్లు తెలిపారు.
ఆదివారం హైదరాబాద్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, రైతులకు మెరుగైన సేవలు అందించడం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కొనుగోలు కేంద్రాల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నేరుగా తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడతామని చెప్పారు. రైతులు నష్టపోయేలా డిస్ట్రెస్ సేల్స్ జరగడానికి గల కారణాలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, వాటి నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు వెల్లడించారు.
మార్కెట్ సెస్ ఎగవేత, వేలం ప్రక్రియలో పారదర్శకత, డిజిటల్ సేవల అమలు, రికార్డుల నిర్వహణ వంటి అంశాలను ప్రత్యేకంగా పరిశీలిస్తామని మంత్రి తెలిపారు. తనిఖీ బృందాలు ప్రతి వారం ప్రభుత్వానికి సమగ్ర నివేదికలు సమర్పిస్తాయని, ఆ నివేదికల ఆధారంగా వచ్చే వారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి అవసరమైన సంస్కరణలు అమలు చేస్తామని చెప్పారు.
ఇదిలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి తీసుకురావడానికి జులై 27 నుంచి 29 వరకు అన్ని రైతు వేదికల్లో విత్తన మేళాలను నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల ప్రకటించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల ప్రతి మండల రైతు వేదికలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తక్కువ నీటితో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటల విత్తనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు.
ప్రతి రైతు వేదికలో నాలుగు నుంచి ఐదు ప్రత్యేక విత్తన కౌంటర్లు ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచుతామని మంత్రి వివరించారు. నాణ్యమైన విత్తనాల ఎంపిక, పంటల సాగు విధానాలపై పీజేటీఏయూ, ఎస్‌కేఎల్‌టీయూ, ఐఐఎంఆర్, ఐఐఓఆర్ శాస్త్రవేత్తల సలహాలు తీసుకుంటామని తెలిపారు. కృషి విజ్ఞాన్ కేంద్రాల శాస్త్రవేత్తలు, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారుల సహకారంతో రైతులకు పంటల ఎంపిక, సాగు పద్ధతులు, తక్కువ నీటితో అధిక దిగుబడి సాధించే పంటలపై ప్రత్యేక అవగాహన కల్పిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.








