Mahaa Daily Exclusive

  నకిలీ బంగారంతో బ్యాంకులకు టోకరా…

Share

*నకిలీ బంగారంతో బ్యాంకులకు టోకరా..

*బయటపడుతున్న వ్యాపారి నకిలీ భాగోతం

*నకిలీ దందాతో కోట్లు గడించిన కారేపల్లి వ్యాపారి

*పరారీలో పలువురు పాత్రధారులు

*ముఠా మోసాలపై పోలీసుల ముమ్మర దర్యాప్తు

కారేపల్లి,మహ:
నకిలీ బంగారంతో బ్యాంకులను మోసం చేసిన ముఠా బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతుంది.కారేపల్లికి చెందిన వ్యాపారి కీలక సూత్రధారిగా ఉండి చేసిన అక్రమాలన్నీ పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసినట్లు సమాచారం.మండలంలోని భాగ్యనగర్ తండాకు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు తీగ లాగితే నకిలీ ముఠా డొంకంతా కదిలింది. నకిలీ బంగారం వ్యాపారం కారేపల్లికి చెందిన వ్యాపారి కోట్లాది రూపాయలు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ ఫేక్ గోల్డ్ మెన్ రాష్ట్రవ్యాప్తంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని నకిలీ కార్యకలాపాలు కొనసాగించాడనే సమాచారం. ప్రధానంగా కారేపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు,రఘునాధపాలెం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఫేక్ గోల్డ్ మెన్ చేసే అక్రమ వ్యాపారంలో ప్రధాన భాగస్వాములనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పాత్రధారులంతా ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు సమాచారం.

*గుర్తు పట్టలేని విధంగా ఫేక్ గోల్డ్ ఆర్టికల్స్ తయారీ చేయడంలో దిట్ట

నకిలీ బంగారు వస్తువులను తయారు చేయడంలో ఫేక్ గోల్డ్ మెన్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.నకిలీ బంగారం వస్తువులకు పైన గోల్డ్ పూత పూసి వాటిని ఏమాత్రం గుర్తించని విధంగా తయారు చేయడంలో ఈ బృందం ఆరితేరింది.ఫేక్ గోల్డ్ తో పాటు గోల్డ్ ఆర్నమెంట్స్ లో కూడా గుర్తించలేని విధంగా లోపల స్టోన్స్ పెట్టి మరో దందాకు ఈ బృందం తెరలేపినట్టు సమాచారం.అనేక మోసాలతో కోట్లాది రూపాయలను కూడగట్టి రఘునాధపాలెం ప్రాంతంలో భూమిని కొనుగోలు చేశాడనే ప్రచారం జరుగుతోంది. హైదరాబాదు,విజయవాడలో ఆస్తులు కొనుగోలు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు అనేక ఆరోపణలు ఉన్నాయి. లావాదేవీలన్నీ ఎక్కడ దొరకకుండా జాగ్రత్త పడటంలో కూడా ఈ ముఠా అనేక జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం.

*పోలీసుల ముమ్మర దర్యాప్తు షురూ:
నకిలీ బంగారం పై ఫిర్యాదు రావడంతో రంగంలో దిగిన కారేపల్లి పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.సింగరేణి సీఐ సాగర్, కారేపల్లి ఎస్సై గోపి ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు.పోలీస్ శాఖలో నేర పరిశోధన చేయడంలో మంచి పేరున్న సమర్థవంతమైన పోలీసు అధికారిగా సీఐ సాగర్ కు ప్రత్యేకమైన పేరు ఉంది.అక్రమ వ్యవహారాలు ఈ అధికారి చేతికి చిక్కితే సమగ్రమైన విచారణ జరిపి తతంగాలను బయటపెట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారనే చర్చ మండలంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.