Mahaa Daily Exclusive

  ప్రతికూల వాతావరణానికి తలొగ్గని వ్యవసాయ క్షేత్రాల నిర్మాణ వ్యూహం: అనువైన పంటలు, పక్కా లోకల్ ప్లానింగ్ తోనే సుస్థిర సేద్యం!

Share

ప్రతికూల వాతావరణానికి తలొగ్గని వ్యవసాయ క్షేత్రాల నిర్మాణ వ్యూహం: అనువైన పంటలు, పక్కా లోకల్ ప్లానింగ్ తోనే సుస్థిర సేద్యం!

పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతల కారణంగా వర్షాలు అంచనాలకు అందకపోవడంతో, ఇటీవలి దశాబ్దాల్లో భారతదేశంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తరచుగా మారుతున్న వర్షపాత విధానాలను ఎదుర్కొంటున్నాయి. భారతదేశ వ్యాప్తంగా క్యుములేటివ్ రెయిన్‌ఫాల్ సాధారణం లేదా లాంగ్ పీరియడ్ యావరేజ్ కు దగ్గరగా ఉన్నప్పటికీ, విచ్ఛిన్నమైన వర్షపాతం జిల్లా మరియు మండల స్థాయిలలో పెద్ద లోటు మరియు అదనపు వర్షాలతో విభిన్న వైవిధ్యాలను సూచిస్తుంది. ఇంకా, వర్షపాతం టెంపోరల్ డిస్ట్రిబ్యూషన్, అంటే ఒక సంవత్సరంలో లేదా ఒక సీజన్‌లో వర్షాలు ఏయే నెలల్లో, ఏయే సమయాల్లో, ఎలా కురవడం కూడా స్వల్పకాలిక భారీ వర్షాలు మరియు సుదీర్ఘ డ్రై స్పెల్స్ తో ఎక్కువగా అనిశ్చితంగా మారుతోంది.

ఈ నేపథ్యంలో, భారత వాతావరణ శాఖ (ఐ.ఎం.డి) విడుదల చేసిన వర్షపాత డేటా ప్రకారం, ఆల్-ఇండియా స్థాయిలో సాధారణ వర్షపాతం మరియు జిల్లా స్థాయిల్లో గణనీయమైన లోటు మరియు అదనపు వర్షపాతం నమోదు కావడం ఈ నెల ప్రారంభం వరకు రుతుపవనాల పురోగతి ఇందుకు ఒక ఉదాహరణ. అలాగే, ఖరీఫ్ సోయింగ్ అంటే వానాకాలం సాగుకు కీలకమైన జూన్ నెలలో దాదాపు అంతటా పొడి వాతావరణం అంటే డ్రై స్పెల్ నెలకొనగా, ఆ తర్వాత జూలై మొదటి వారంలో భారీ మరియు తీవ్రమైన వర్షపాతం నమోదైనట్లు టెంపోరల్ డిస్ట్రిబ్యూషన్ సూచిస్తోంది. వర్షాల స్పేషియల్ మరియు టెంపోరల్ డిస్ట్రిబ్యూషన్ నమూనాలో ఇటువంటి మార్పులు గత కొన్ని దశాబ్దాలుగా క్రమంగా పెరిగి, వ్యవసాయ ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయి. ఇటువంటి పరిస్థితులలో, మారుతున్న వర్షపాతం మరియు వాతావరణ నమూనాలకు భారతీయ వ్యవసాయం అనుగుణంగా మారడానికి తగిన వ్యూహాలను రూపొందించాలి. వర్షపాత విధానంపై దీర్ఘకాలిక అధ్యయనాలు 1980ల తర్వాత వర్షపాత విధానంలో వ్యత్యాసాలు గణనీయంగా పెరిగాయని సూచిస్తున్నాయి. ఉపరితల గాలి కంటే సముద్ర ఉష్ణోగ్రతలు వేగంగా పెరగడం దీనికి ప్రధాన కారణం.

కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్, సి.ఇ.ఇ.డబ్ల్యూ ద్వారా 1982 నుండి 2022 వరకు రుతుపవనాల వర్షపాతంపై చేసిన అధ్యయనం, 64 శాతం మండలాల్లో విపరీతమైన వర్షపాతం పెరిగినట్లు వెల్లడించింది. దీనికి విరుద్ధంగా, దాదాపు సగం వ్యవసాయ ఉత్పత్తికి కారణమైన ఇండో-గంగా మైదానాలలో ఉన్న సుమారు 11 శాతం మండలాలు, వర్షపాతంలో 10 శాతానికి పైగా తగ్గుదలను చూశాయి. 1951-1980తో పోలిస్తే 1981-2011 కాలంలో డ్రై స్పెల్స్ 27 శాతం పెరిగాయి. కానీ 40-సంవత్సరాల అధ్యయన కాలంలో దేశం యొక్క మొత్తం వర్షపాతం మూడు సంవత్సరాలలో మాత్రమే లోటు ను మరియు ఎనిమిది సంవత్సరాలలో అదనపు వర్షపాతాన్ని నమోదు చేసింది. అందువలన, ఆల్-ఇండియా స్థాయిలో అగ్రిగేట్ రెయిన్‌ఫాల్ నమూనా తీవ్రమైన వైవిధ్యాలను ప్రతిబింబించడం లేదు. రాబోయే దశాబ్దాల్లో వర్షపాత నమూనాలో మార్పులు వేగవంతం కావచ్చని పరిశోధన అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి. అటువంటి దృష్ట్యా, స్థిరమైన వ్యవసాయ ఉత్పత్తిని నిర్ధారించడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించడం అత్యవసరం.దీని కోసం తీసుకోవాల్సిన చర్యలు ఈ దిశగా ఉండటం అవసరం:

*వికేంద్రీకృత ప్రణాళికతో స్థానిక మరియు విభిన్న వర్షపాత నమూనాలను పరిష్కరించడానికి, జిల్లాలను లేదా మండలాలను అమలు విభాగాలుగా తీసుకుని ఆగ్రో-క్లైమాటిక్ జోన్స్ మరియు సబ్-జోన్ స్పెసిఫిక్ డిసెంట్రలైజ్డ్ ప్లానింగ్ ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

*తగినంత ఇన్‌పుట్ సరఫరాలతో అనువైన ప్రత్యామ్నాయ పంట ఉత్పత్తి ప్రణాళికలు అవసరం. పంట దెబ్బతిన్నప్పుడు లేదా ఉత్పత్తి ప్రారంభ దశలో నష్టం జరిగినప్పుడు తగిన మోతాదులో అనువైన పంటల నాణ్యమైన విత్తనాలు మరియు ఉత్పాదకాలను నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో, తహసీల్ లేదా మండల స్థాయిలలో స్థానిక విత్తన బ్యాంకులను అభివృద్ధి చేసి నిర్వహించాలి.

*వాన నీటి సంరక్షణలో భాగంగా పొలాల్లో, డ్రై స్పెల్స్ కాలంలో ఉపయోగపడే వర్షపు నీటిని నిల్వ చేయడానికి చిన్న చెరువులను నిర్మించడం ద్వారా వాన నీటిని కమ్యూనిటీ వనరుగా నిర్వహించడానికి రైతులను ప్రోత్సహించాలి. ఇది అదనపు నీటి రన్-ఆఫ్ ను సేకరించడంలోనే కాకుండా సారవంతమైన పై మట్టిని సంరక్షించడంలో కూడా సహాయపడుతుంది.

*పూడికతీత, విస్తరణ పనుల్లో భాగంగా గ్రామాల్లోని చెరువులు మరియు ఇతర ఉపరితల నీటి నిల్వ ప్రాంతాల స్టోరేజ్ కెపాసిటీని పెంచడానికి వాటిలో డి-సిల్టింగ్ పనులు క్రమం తప్పకుండా చేపట్టాలి. దీని కోసం, అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ సర్వీసెస్ ను బలోపేతం చేయడం అత్యవసరం.

*సాంకేతికత వినియోగంతో రైతులకు సకాలంలో సహాయం అందించేందుకు స్థానిక స్థాయిలో రియల్-టైమ్ వెదర్ ఫోర్కాస్టింగ్ మరియు అవసరమైన క్రాప్ అడ్వైజరీ సేవలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

*కరువును మరియు వరదలను తట్టుకోగల హై యీల్డింగ్ వెరైటీస్ అభివృద్ధిని ప్రోత్సహించడం చాలా ముఖ్యం. మెరుగైన సాగు పద్ధతులను అభివృద్ధి చేయడానికి సాంకేతిక ఆవిష్కరణలను కూడా ప్రోత్సహించాలి.

(శివ కుమార్ గనివాడ, సీనియర్ అగ్రికల్చర్ అండ్ ట్రేడ్ ఎక్స్‌పర్ట్)