Mahaa Daily Exclusive

  రైతులకు కేంద్రం శుభవార్త…

Share

  • రైతులకు కేంద్రం శుభవార్త
  • పీఎం-కిసాన్ పథకం మరో ఐదేళ్లు పొడిగింపు
  • 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు పథకం కొనసాగింపు
  • ఐదేళ్ల కోసం రూ. 3.15 లక్షల కోట్ల కేటాయింపునకు ఆమోదం
  • ఏటా రూ. 6,000 ఆర్థిక సాయం యథాతథంగా కొనసాగింపు
  • కేంద్ర కేబినెట్ లో కీలక నిర్ణయాలు

న్యూఢిల్లీ, మహా : కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని నిర్ణయించింది. శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేశారు.

ఈ పొడిగింపుతో పీఎం-కిసాన్ పథకం 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు అమల్లో ఉండనుంది. ఇందుకోసం రాబోయే ఐదేళ్లకు గానూ రూ. 3,15,614 కోట్లను కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ. 6,000 ఆర్థిక సాయం అందుతున్న విషయం విదితమే. ఈ మొత్తాన్ని మూడు సమాన వాయిదాల్లో, అంటే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2,000 చొప్పున ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా నేరుగా ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తారు. రైతులకు కనీస ఆదాయ భరోసా కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరి 24న ఈ పథకాన్ని ప్రారంభించింది. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం వివరాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక మద్దతు నిరంతరాయంగా కొనసాగనుంది.

మరోవైపు, రాబోయే ఐదేళ్లలో 5,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ‘ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన’కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ. 5,070 కోట్లను కేటాయించింది. అలాగే, ఖేల్ ఇండియా పథకానికి రూ. 29 వేల కోట్లు, సముద్ర మంథన్ ప్రాజెక్టుకు రూ. 84 వేల కోట్లు, సొరంగాల నిర్మాణం కోసం రూ. 9,779 కోట్లు కేటాయిస్తూ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఖేలో ఇండియా, సముద్ర మంథన్‌లకు భారీ నిధులు

దీంతో పాటు క్రీడారంగం, సముద్ర ఇంధన అన్వేషణ రంగానికి సంబంధించి రూ. 4.35 లక్షల కోట్లకు పైగా బడ్జెట్‌తో చేపట్టిన పలు కీలక పథకాలకు ఆమోదముద్ర వేసింది.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక క్రీడాభివృద్ధి కార్యక్రమంగా రూపుదిద్దుకున్న ‘ఖేలో ఇండియా’ విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఖేలో ఇండియా పథకంతో పాటు జాతీయ క్రీడా సమాఖ్యలకు అందించే సహాయాన్ని కలిపి మొత్తం రూ. 36,441 కోట్లు కేటాయించారు. ఇందులో ఖేలో ఇండియా పథకానికి రాబోయే ఐదేళ్లకు గాను రూ. 29,054 కోట్లు కేటాయించారు. ఇది మునుపటి బడ్జెట్ కంటే దాదాపు ఎనిమిది రెట్లు ఎక్కువ. 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ, 2036 ఒలింపిక్స్ వేలం దిశగా అడుగులు వేస్తున్న భారత్, క్రీడల్లో ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు ఈ నిధులు తోడ్పడనున్నాయి. అలాగే జాతీయ క్రీడా సమాఖ్యలకు ఐదేళ్ల వ్యవధిలో రూ. 7,387 కోట్ల సాయం అందించనున్నారు.

‘సముద్ర మంథన్’తో ఇంధన రంగంలో విప్లవం

దేశీయంగా చమురు, సహజ వాయువు ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘సముద్ర మంథన్’ (నేషనల్ ఆఫ్‌షోర్ ఎక్స్‌ప్లోరేషన్ స్కీమ్) ప్రారంభానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు అమలు కానున్న ఈ పథకానికి రూ. 84,084 కోట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా సముద్ర తీర ప్రాంతాల్లో చమురు, గ్యాస్ నిల్వల అన్వేషణను వేగవంతం చేస్తారు. 600 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆయిల్ ఈక్వివలెంట్ (MMTOE) కంటే ఎక్కువ నిల్వలను కనుగొనాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల దిగుమతులపై ఆధారపడటం తగ్గడమే కాకుండా ఇంధన రంగంలో భారీగా కొత్త ఉద్యోగాలు, పెట్టుబడులు తరలివచ్చే అవకాశముంది.

పీఎంఎస్ఎస్ వైకి ఆమోదం

నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్లు: రూ.5,070 కోట్లతో ‘పీఎం సూర్య సరోవర్ యోజన’కు కేబినెట్ ఆమోదం తెలిపింది. పునరుత్పాదక ఇంధన రంగాన్ని విస్తరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన’ పథకానికి ఆమోదం తెలిపింది. రూ.5,070 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ పథకం ద్వారా నీటిపై తేలియాడే (ఫ్లోటింగ్) సోలార్ ప్లాంట్ల సాయంతో 5,000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టుల వద్దే విద్యుత్‌ను నిల్వ చేసే వ్యవస్థలను కూడా అనుసంధానించనున్నారు. ఈ పథకం కింద కనీసం రెండు గంటల పాటు విద్యుత్‌ను నిల్వ ఉంచేలా (మొత్తంగా 10,000 ఎండబ్యూహెచ్) సామర్థ్యాన్ని అందుబాటులోకి తెస్తారు. 2026-27 నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరాల మధ్య ఈ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయనుండగా, 2032-33 వరకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందుతుంది. ప్రస్తుతం దేశంలో తేలియాడే సోలార్ ప్లాంట్ల సామర్థ్యం కేవలం 700 మెగావాట్లు మాత్రమే ఉండగా, ప్రాజెక్టులు, జలాశయాల్లో దాదాపు 102.18 గిగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలున్నాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ స్పష్టం చేసింది.