Mahaa Daily Exclusive

  ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌కు ఎంజీఆర్ వినతి

Share

ఖైరతాబాద్ : ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “సమస్యలపై సమరం” కార్యక్రమంలో భాగంగా గత కొన్ని రోజులుగా అన్ని డివిజన్లలో చేపట్టిన పాదయాత్రల సందర్భంగా ప్రజలు వెల్లడించిన సమస్యలను జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌కు వినతిపత్రం ద్వారా ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి (ఎంజీఆర్) సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు.

బంజారాహిల్స్ డివిజన్ ఉదయ్‌నగర్ సింగాడ బస్తీలో ప్రమాదకరంగా మారిన ప్రధాన నాలాను పునర్నిర్మించాలని, ప్రేమ్‌నగర్‌లోని సాయిబాబా కమాన్ వద్ద నాలాపై రక్షణ గ్రిల్ ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. అలాగే వెంకటేశ్వర కాలనీ డివిజన్ రోడ్ నెం.3 నవోదయ కాలనీలో టైమ్స్ ఆఫ్ ఇండియా లైన్ పక్కనున్న దెబ్బతిన్న రోడ్డును వెంటనే పునర్నిర్మించాలని, గతంలో ఇచ్చిన వినతిపత్రంపై స్పందన లేకపోవడంతో మరోసారి అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

ఫిలింనగర్ డివిజన్ హనుమాన్ టెంపుల్ లేన్‌లో సీసీ రోడ్డు నిర్మాణానికి మంజూరు ఇవ్వాలని, ఖైరతాబాద్ డివిజన్ మూడు గుళ్ల ప్రాంతంలో వర్షపు నీరు, మంచినీటి సరఫరా కలవడంతో కలుషిత నీరు వస్తోందని, దీనిపై అత్యవసర చర్యలు తీసుకోవాలని కోరారు.

నియోజకవర్గ వ్యాప్తంగా స్ట్రీట్ లైట్ల నిర్వహణ తీవ్ర సమస్యగా మారిందని ఎంజీఆర్ తెలిపారు. ముఖ్యంగా ఖైరతాబాద్ డివిజన్ బాలాపూర్ బస్తీ, రామకృష్ణ నగర్ క్వార్టర్స్, జూబ్లీహిల్స్ డివిజన్ ఇంద్రానగర్, వెంకటేశ్వర డివిజన్ దేవరకొండ బస్తీల్లో స్ట్రీట్ లైట్ల సమస్య అధికంగా ఉందని పేర్కొన్నారు. అవసరమైన స్టాక్‌ను వెంటనే అందుబాటులోకి తీసుకువచ్చి ప్రత్యేక చర్యలు చేపట్టి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని జోనల్ కమిషనర్‌ను కోరారు.

ప్రజలు పాదయాత్రల్లో తెలియజేసిన ప్రతి సమస్య పరిష్కారమయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఎంజీఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పాల్గొన్నారు.