• పంట బీమా గడువు పొడిగింపు.
అమరావతి, మహా.
ఖరీఫ్ సాగు చేస్తున్న రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఖరీఫ్ పంటల బీమా నమోదు గడువును మరో 15 రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. జులై 31తో ముగియాల్సిన గడువును పొడిగించడం ద్వారా ఇంకా నమోదు చేసుకోని రైతులకు అవకాశం కల్పించింది. ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, వర్షాభావం వంటి కారణాలతో పంటలు దెబ్బతిన్నప్పుడు రైతులకు ఆర్థిక రక్షణ కల్పించడమే ఈ నిర్ణయం లక్ష్యమని ప్రభుత్వం వెల్లడించింది.
కేవలం రూ.1 ప్రీమియంతో పంటల బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు నమోదు చేసుకోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సాగులో ఉన్న ప్రతి ఎకరానికీ తప్పనిసరిగా బీమా నమోదు చేసుకోవాలని సూచించారు. పంట నష్టం సంభవించినప్పుడు పరిహారం పొందాలంటే గడువు ముగిసేలోపు నమోదు పూర్తి చేయడం అవసరమని స్పష్టం చేశారు.
రైతులు సమీపంలోని బ్యాంకులు, కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్సీ), రైతు సేవా కేంద్రాల ద్వారా లేదా ఎన్‌సీఐపీ మొబైల్ యాప్‌ను వినియోగించి సులభంగా బీమా నమోదు చేసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. గడువు పొడిగింపును దృష్టిలో ఉంచుకుని అర్హులైన ప్రతి రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది.








