Mahaa Daily Exclusive

  అధికారంలోకి వచ్చేది మేమే యువకులు ఆత్మహత్యలు చేసుకోవద్దు జాబ్‌క్యాలెండర్‌ ను ప్రశ్నిస్తూ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలచి వేసిందన్న కేటీఆర్

Share

హైదరాబాద్, మహా : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని, ముఖ్యంగా యువతను జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో నిలువునా ముంచారని బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. చట్టసభల్లో పెట్టిన జాబ్‌ క్యాలెండర్‌ కూడా దిక్కులేదని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ విమర్శించారు. అందుకే యువత నిర్వేధంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, ఎవరూ అధైర్య పడొద్దని హితవుపలికారు. ” ఎన్నికల ముందు డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ మోసం. రాష్ట్రంలో నిరుద్యోగులు నిర్వేదంలో ఉన్నారు. కాంగ్రెస్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ఏమైంది? డిప్యూటీ సీఎం ఇలాకాలో యువకుడు లేఖ రాసి ఆత్మహత్యయత్నం చేశాడు. కాంగ్రెస్ హామీ ఏమైందని యువకుడు ప్రశ్నించాడు. పిల్లలు ఇక్కడ ఆత్మహత్యలకు పాల్పడుతుంటే రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నాడు? ఇంజినీర్లు క్రిమినల్ వేస్టు అని రేవంత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. రెండేళ్లలో 10 వేల ఉద్యోగాలు కూడా దాటలేదు. మీ చేతగాని అసమర్థ పాలనకు ఒక ఛార్జిషీట్ ఈ సూసైడ్ నోట్. ఆ పిల్లాడి సూసైడ్ నోట్ చూస్తే బాధ కలిగింది. నిరుద్యోగులు దయచేసి బలవన్మరణాలకు పాల్పడవద్దు. మా ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలు భర్తీ చేస్తాం. దయచేసి తనువులు చాలించకండి.” అని సూచించారు.

జెన్‌జీ ఉద్యమంలో పాల్గొన్నట్టు , విద్యార్థులకు అండగా ఉంటున్నట్టు రాహుల్ గాంధీ ఫోజులు కొడుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇక్కడ మాత్రం ఆ పార్టీ సీఎం విద్యార్థులను క్రిమినల్స్‌తో పోలుస్తున్నారని, దీనికి రాహుల్ చెప్పే సమాధానం ఏంటని నిలదీశారు. ” విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలికినట్టుగా రాహుల్ పోజులు. మీ ముఖ్యమంత్రి ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అన్నాడు. రేవంత్ వ్యాఖ్యలపై రాహుల్ ఉలకడు పలకడు. రాహుల్‌కు, రేవంత్‌కు విద్యార్థుల ముందకొచ్చి మాట్లాడే దమ్ములేదు. ఇతర రాష్ట్రాల్లో లాఠీఛార్జీలు జరిగితే రాహుల్ పరిగెత్తుకొని పోతాడు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లాఠీఛార్జీలు జరిగితే మాత్రం రాడు. ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అంటే అందరం బాధపడ్డం. విదేశాల్లో పనిచేస్తున్న మన ఇంజనీర్లు క్రిమినల్ వేస్టా? రాహుల్ గాంధీ, రేవంత్ కలిసి ప్రకటించిన డిక్లరేషన్లు క్రిమినల్ వేస్ట్. వందల టీఎంసీల నీళ్లను సముద్రంలోకి వదలడం క్రిమినల్ వేస్ట్. రూ.200 కోట్లతో అందాల పోటీలు పెట్టడం క్రిమినల్ వేస్ట్. మెస్సీతో ఫుట్ బాల్ ఆటకు రూ.100 కోట్లు తగలేయడం క్రిమినల్ వేస్ట్. తెలంగాణకు రేవంత్ అనే సన్నాసిని సీఎంగా పెట్టడమే క్రిమినల్ వేస్ట్. రేవంత్ ఏం చదివిండో డౌటే. నకల్ కొట్టి పాసైన బాపతే అయ్యింటుంది.” అని ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోడలకు సున్నాలు వేసుకొని బతికేటోడివి అంటూ హేళనగా మాట్లాడారు. కనీసం ఎలక్షన్‌ ఫామ్‌ కూడా నింపడం రాలేదని ఎద్దేవా చేశారు. జీవితంలో ఇంటర్వ్యూకైనా హాజరైనావా అని ప్రశ్నించారు. ” మిస్టర్ రేవంత్.. నీ ఎలక్షన్ ఫామ్ నింపుగలుగుతవా? నీ జీవితంలో ఒక్క పోటీ పరీక్ష రాసినవా? ఎప్పుడైనా ఒక ఇంటర్వ్యూకు హాజరైనవా? మేం కష్టపడి చదివినం.. గొప్పగొప్ప యూనివర్సిటీల్లో చదివినం. గోడల మీద సున్నాలేసుకొని బతికినోడివి నువ్వు. నీకే అంతుంటే.. ఇంజనీర్లకు ఎంతుండాలి? హైదరాబాద్ లో ఫ్లై ఓవర్లు కట్టిందెవరు? ఇంజనీర్లు కాదా? ఎల్లంపల్లి నుంచి రివర్స్ పంపింగ్ చేస్తున్నది ఇంజనీర్లు కాదా? నువ్వు కూసునే కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టింది ఇంజనీర్లు కాదా? ఇంజీనర్లకు కట్టడం తెలుసు.. మీ పార్టీకి సమాధి కట్టడం కూడా తెలుసు.” అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.

అసెంబ్లీ 15 రోజులు నడపాల్సిందే

రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. ఈసారి కచ్చితంగా అసెంబ్లీ 15 రోజులు నడపాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్యతోపాటు ఇతర విషయాలపై సమగ్రంగా చర్చించాలన్నారు. “నిరుద్యోగుల తరఫున రేవంత్, రాహుల్ ను ప్రశ్నిస్తున్న. రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడిస్తారు? రాహుల్, రేవంత్ ఎక్కడ చచ్చారు? అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నడపాల్సిందే. నిరుద్యోగుల తరఫున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. నిరుద్యోగులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని నా ప్రార్థన. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకో. ముందు నీ చేతిలో ఉన్న పని చేయి.” అని డిమాండ్ చేశారు.

మోడీ ఆపారనడం బుకాయింపే

బీసీ రిజర్వేషన్లు మోడీ ఆపారని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆయన చేసిన తీర్మానం చిత్తు కాగితమని అన్నారు. విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కేలా రేవంత్ వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. విద్యా హక్కు చట్టాన్ని తెచ్చింది సోనియా గాంధీ అని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ తీసుకొచ్చిన చట్టాన్ని వాళ్లే తుంగలో తొక్కుతారా? అని ప్రశ్నించారు. “గురుకులాల్లో 150 మంది విద్యార్థులను చంపడం కాంగ్రెస్ సక్సెసా? ఎండ్రిన్ తాగి చావండని తిట్టడం సక్సెసా? కాంగ్రెస్ వచ్చాక తెలంగాణలో టెక్ ఉద్యోగాలు తగ్గిపోయాయి. ఏడు వేల ఐటీ ఉద్యోగాలు పోయాయి. ఎందుకు పోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సీఎం రేవంత్, విద్యా శాఖ అట్టర్ ఫ్లాప్. అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే రేవంత్ అర్థం లేని మాటలు.” అని మండిపడ్డారు.