బస్సు ఎక్కే ముందే టికెట్.
* టీజీఎస్ ఆర్టీసీ సరికొత్త సేవలు.
* అడ్వాన్స్ టికెటింగ్, డిజిటల్ విద్యార్థి బస్‌పాస్‌లకు శ్రీకారం.
* చిలకలగూడలో కొత్త బస్ టెర్మినల్
హైదరాబాద్, మహా.
ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. హైదరాబాద్ మెట్రో తరహాలో బస్సు ఎక్కే ముందే టికెట్ బుక్ చేసుకునే ‘అడ్వాన్స్ బోర్డింగ్ టికెటింగ్’ విధానాన్ని త్వరలో అమల్లోకి తీసుకురానుంది. ‘మీ టికెట్’ మొబైల్ యాప్‌లో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో విద్యార్థులకు డిజిటల్ బస్‌పాస్‌లను కూడా జారీ చేయాలని నిర్ణయించింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం 3,200కు పైగా ఆర్టీసీ బస్సులు నిత్యం సుమారు 26 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. వీరిలో దాదాపు 70 శాతం మంది మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా ప్రయాణిస్తున్నారు. రోజుకు సుమారు రూ.6.5 కోట్ల ఆదాయం ఆర్టీసీకి లభిస్తుండగా, అందులో 23 శాతం డిజిటల్ చెల్లింపుల ద్వారానే వస్తోంది. కొత్త అడ్వాన్స్ టికెటింగ్ విధానం అమల్లోకి వస్తే డిజిటల్ లావాదేవీలు మరింత పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం రద్దీ సమయాల్లో బస్సుల్లో టికెట్ జారీ ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతుండటంతో బస్సుల షెడ్యూల్‌పై ప్రభావం పడుతోంది. కొన్నిసార్లు డిజిటల్ చెల్లింపుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల ప్రయాణికులు, కండక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలకు పరిష్కారంగా ప్రయాణికులు ముందుగానే మొబైల్ యాప్‌లో తమ బోర్డింగ్ స్టాప్, గమ్యస్థానాన్ని ఎంపిక చేసుకుని యూపీఐ లేదా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. అలాగే యాప్ ద్వారా బస్సు ప్రస్తుత స్థానాన్ని ట్రాక్ చేస్తూ ప్రయాణ సమయాన్ని ముందుగానే అంచనా వేసుకునే వీలు ఉంటుంది.
డిజిటల్ బస్‌పాస్‌లకు ఇప్పటికే ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న ‘మీ టికెట్’ యాప్ ద్వారా ప్రారంభించిన ఈ సేవలను ఇప్పటివరకు 14 వేల మందికి పైగా వినియోగించుకోగా, ఆర్టీసీకి రూ.2 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. ప్రస్తుతం సిటీ ఆర్డినరీ, మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెస్, పుష్పక్ బస్‌పాస్‌లతో పాటు టీ-24 టికెట్లు కూడా డిజిటల్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. త్వరలో విద్యార్థుల బస్‌పాస్‌లను కూడా పూర్తిగా డిజిటల్ విధానంలో జారీ చేయనున్నారు. దీంతో బస్‌పాస్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గడమే కాకుండా, సిబ్బందిపై పనిభారం కూడా తగ్గనుంది.
ఇక హైదరాబాద్‌లో పెరుగుతున్న రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని మౌలిక సదుపాయాల అభివృద్ధిపైనా ఆర్టీసీ దృష్టి సారించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చిలకలగూడలో కొత్త బస్ టెర్మినల్‌తో పాటు ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనుంది. దక్షిణ మధ్య రైల్వే, ఆర్టీసీ మధ్య కుదిరిన భూ బదిలీ ఒప్పందం ఆధారంగా ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అమలుకానుంది. ఈ చర్యలతో హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థ మరింత ఆధునికంగా, ప్రయాణికులకు అనుకూలంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు.








