ఎస్‌ఐఆర్‌పై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలి.
• ఆగస్టు 10లోగా అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు నమోదు చేయించాలి.
• బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు
హైదరాబాద్, మహా.
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) రెండో విడత ప్రక్రియపై బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు నమోదు జరిగేలా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్‌లో శనివారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎస్‌ఐఆర్ రాష్ట్ర కన్వీనర్ వేముల అశోక్ అధ్యక్షతన నిర్వహించిన ఎస్‌ఐఆర్ ఫేజ్-2 రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌కు రాంచందర్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియకు ఆగస్టు 10 వరకు మాత్రమే గడువు ఉన్నందున, ప్రతి నియోజకవర్గంలో అర్హులైన వారందరితో ఫారమ్-6 ద్వారా కొత్త ఓటు నమోదును వేగవంతం చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
గడువు ముగిసిన తర్వాత కూడా ఓటర్ల జాబితాకు సంబంధించి పలు కీలక ప్రక్రియలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. డ్రాఫ్ట్ జాబితాల పరిశీలన, నకిలీ ఓట్ల గుర్తింపు, అభ్యంతరాల దాఖలు వంటి అంశాలపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఓట్ల తొలగింపునకు సంబంధించిన ఫారమ్-7, వివరాల సవరణ కోసం ఫారమ్-8ను నిబంధనల ప్రకారం దాఖలు చేయాలని రాంచందర్‌రావు సూచించారు. ఎన్నికల అధికారులు జారీ చేసే నోటీసులకు అవసరమైన ఆధారాలతో చట్టపరంగా సమాధానాలు ఇవ్వడంపై బూత్ లెవల్ ఏజెంట్-1లు (బీఎల్‌ఏ-1), పార్టీ లీగల్ టీమ్‌లు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. అలాగే పోలింగ్ బూత్‌ల రేషనలైజేషన్ ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ఓటర్ల జాబితా పారదర్శకత అత్యంత కీలకమని రాంచందర్‌రావు పేర్కొన్నారు. అర్హులైన ఓటర్లకు జాబితాలో స్థానం కల్పించడంతో పాటు అనర్హులు, నకిలీ ఓట్లను గుర్తించే ప్రక్రియను కూడా నిబంధనలకు అనుగుణంగా పర్యవేక్షించాల్సిన బాధ్యత బీజేపీ ప్రతినిధులపై ఉందన్నారు. ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో పార్టీ శ్రేణులు సమర్థవంతంగా పనిచేసి ఎన్నికల జాబితా మరింత పారదర్శకంగా ఉండేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.







