అమరావతి, మహా .
రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిచెందడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న వైద్య విద్యార్థిని ఇలా ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ప్రియాంక మృతికి కారణమైన నిందితులు ఇప్పటికే అరెస్టై జైలులో ఉన్నారని, వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ ఘటన అత్యంత బాధాకరమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మద్యం మత్తులో వాహనం నడిపి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న నిందితులపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. కేసులో పటిష్ఠమైన చట్టపరమైన చర్యలు తీసుకుని, కఠిన సెక్షన్ల కింద నిందితులకు శిక్ష పడేలా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
ప్రియాంక కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. యువత మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరుగుతున్న ప్రమాదాలపై మరింత కఠిన చర్యలు అవసరమన్న అభిప్రాయం ఈ ఘటనతో మరోసారి వ్యక్తమవుతోంది.
ప్రియాంక మృతిపై చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. “ఎంతో భవిష్యత్తు ఉన్న వైద్య విద్యార్థిని ఇలా ప్రాణాలు కోల్పోవడం నన్ను కలచివేస్తోంది. ఈ ఘటన అత్యంత బాధాకరం. ప్రియాంక మృతికి కారణమైన వారికి కఠిన శిక్షలు పడేలా చూస్తాం. ఈ విషయంలో పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం” అని పేర్కొన్నారు.







