• విదేశీ నిధుల వెనుక దాగిన అంతర్జాతీయ కుట్రలపై ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే సంచలన విశ్లేషణ.
( పి.వి.బాబ్జీ, జియో పొలిటికల్ అనలిస్ట్)
భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా అవతరిస్తున్న తరుణంలో, విదేశీ నిధుల నియంత్రణ చట్టం -2026 సవరణ బిల్లు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు , విదేశీ శక్తులు ఉద్దేశపూర్వకంగా దీనిపై తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో, దేశంలోనే అగ్రశ్రేణి న్యాయవాది, అంతర్జాతీయ న్యాయకోవిదుడు అయిన శ్రీ హరీష్ సాల్వే పలు సంచలన వాస్తవాలను బట్టబయలు చేశారు.
దేశ ఆర్థిక సరిహద్దులను కాపాడుకోవడం ఎంత అవసరమో, విదేశాల నుంచి వచ్చే డబ్బు దేశ విచ్ఛిన్నానికి ఎలా వాడుకోబడుతోందో ఆయన కళ్లకు కట్టినట్లు వివరించారు. ఈ అంశంపై ఆయన పంచుకున్న లోతైన విశ్లేషణ, సూటి ప్రశ్నలకు ఇచ్చిన నిర్మొహమాటమైన సమాధానాలు.
ప్రశ్న: ఎఫ్‌సీఆర్‌ఏ 2026 బిల్లుపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న వివాదం గురించి మీరేమంటారు?
హరీష్ సాల్వే: ఈ వివాదం చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలగడం లేదు. గతంలో వ్యవసాయ చట్టాలు, పౌరసత్వ సవరణ చట్టం తీసుకువచ్చినప్పుడు కూడా సరిగ్గా ఇలాంటి అకారణ వ్యతిరేకతే వ్యక్తమైంది. చట్టం గురించి సరైన చర్చ జరగకుండా, కేవలం ఒక ‘తప్పుడు కథనాన్ని’ సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించడం ఈ మధ్య కాలంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది.
నిజానికి, ఎఫ్ సి ఆర్ ఏ లాంటి చట్టాలు ప్రతి అభివృద్ధి చెందిన దేశంలోనూ ఉంటాయి. ఉదాహరణకు, నేను అమెరికాకు ఒక లక్ష డాలర్లు పంపితే, ఆ డబ్బు ఎందుకు పంపుతున్నానో కచ్చితమైన కారణం చెప్పాలి. అమెరికా తమ ‘డీప్ స్టేట్’ విధానాల గురించి ఇప్పుడు బహిరంగంగానే చెబుతోంది. బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో ప్రభుత్వాలను తామే మార్చామని వారు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భౌగోళిక సరిహద్దులతో పాటు, ఏ దేశమైనా తమ “ఆర్థిక సరిహద్దులను ” రక్షించుకోవడం అత్యంత ఆవశ్యకం.
ప్రశ్న: ఈ చట్టం వల్ల చర్చిలకు విదేశీ నిధులు రాకుండా ఆగిపోతాయని, గిరిజన ప్రాంతాల్లో ఈ నిరసనలు అందుకే తీవ్రంగా ఉన్నాయని ఒక వాదన వినిపిస్తోంది కదా?
హరీష్ సాల్వే: అది పూర్తిగా వాస్తవ విరుద్ధం. గణంకాలు పరిశీలిస్తే, గత సంవత్సరం విదేశాల నుంచి సుమారు రూ. 24,000 కోట్లు రాగా, అందులో చర్చిలకు వెళ్ళింది కేవలం 10% లోపే (సుమారు రూ. 2300 కోట్లు). చర్చిలు నిర్మించుకోవడానికి లేదా మతపరమైన ప్రార్థనలకు ఎవరైనా విరాళాలు ఇస్తే ప్రభుత్వానికి గానీ, చట్టానికి గానీ ఎలాంటి అభ్యంతరం లేదు.
కానీ అసలు ప్రశ్న ఏమిటంటే… మీరు ఆ డబ్బును దేనికి వాడుతున్నారో లెక్కలు చూపించాలి కదా? కొన్ని చోట్ల మతపరమైన సంస్థలు, చర్చిలు రాజకీయ నిరసనలకు కేంద్రాలుగా మారుతున్నాయి. జార్జ్ సోరోస్ లాంటి కుబేరుల నిధులతో ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తే ఎలా ఊరుకుంటారు? ‘చర్చి దేవుడి ఇల్లు.. అది రాజకీయాల ఇల్లు కాదు’ అన్నది వారు గుర్తుంచుకోవాలి.
ప్రశ్న: అమెరికా నిధులతో స్థానిక ఎన్జీవోలు ఛత్తీస్‌గఢ్, కుడంకుళం లాంటి ప్రాంతాల్లో ఉద్యమాలు చేశాయి. కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసమే ఈ నిరసనలను వాడుకుంటున్నారా?
హరీష్ సాల్వే: కచ్చితంగా! దీనికొక ప్రత్యక్ష ఉదాహరణ చెబుతాను. ఒకానొక దశలో ఐటీసీ కి వ్యతిరేకంగా పోరాడిన కొందరు ఎన్జీవో వ్యక్తులకు, ఐటీసీ నాకు ఫీజుగా ఇచ్చిన దానికంటే ఎక్కువ డబ్బు అమెరికా నుంచి ముట్టింది. ఎందుకంటే భారతీయ సంస్థ ఐటీసీని దెబ్బతీస్తే, పరోక్షంగా అమెరికాకు చెందిన ఫిలిప్ మోరిస్ లాంటి కంపెనీలు లాభపడతాయి.
అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని చూసి ప్రపంచం భయపడుతోంది. ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో మన యువత డ్రోన్లు, శాటిలైట్లు సొంతంగా తయారు చేస్తున్నారు. చైనా కంటే భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుండటం పాశ్చాత్య దేశాలకు ఏమాత్రం మింగుడు పడటం లేదు. వారి వ్యాపారాలను కాపాడుకోవడానికే ఇక్కడ కృత్రిమ ఉద్యమాలను సృష్టిస్తున్నారు.
ప్రశ్న: విదేశీ నిధులను అడ్డుకోకపోతే, ఆ డబ్బు భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తుందన్నమాట. మరి ఇదే సమయంలో, మోదీ ప్రభుత్వం మైనారిటీలకు వ్యతిరేకం అని ముద్ర వేయడాన్ని ఎలా చూడాలి?
హరీష్ సాల్వే: ఆ ముద్ర వేయడం పూర్తిగా అబద్ధం. నేను స్వయంగా ఒక క్రైస్తవుడిని. నేను భారతదేశపు అగ్రశ్రేణి న్యాయవాదిగా కులభూషణ్ జాదవ్ కేస్, సింధు జలాల ఒప్పందం లాంటి ఎన్నో కీలకమైన అంతర్జాతీయ కేసుల్లో మోదీ ప్రభుత్వం తరపున వాదించాను. ప్రభుత్వం నన్ను ప్రతిష్టాత్మక ఐఐటీ లకు ఛైర్మన్ గా నియమించింది. నేను క్రైస్తవుడిని అయినప్పటికీ నాపై ప్రభుత్వానికి, మోదీ గారికి అపారమైన నమ్మకం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం మైనారిటీలకు వ్యతిరేకం అని చెప్పడం కేవలం ఒక రాజకీయ కుట్ర మాత్రమే.
ప్రశ్న: బిల్లులో మతపరమైన పనులకు డబ్బులు వాడుకోవచ్చని, కానీ “బలవంతపు మతమార్పిడులకు” వాడకూడదని ఉంది. దీనిపై మీ విశ్లేషణ ఏమిటి?
హరీష్ సాల్వే: రాజ్యాంగం ప్రకారం ఎవరికైనా తమకు నచ్చిన మతాన్ని ఆచరించే స్వేచ్ఛ ఉంది. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ భారతదేశంలో ఉన్న పేదరికాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని “మీరు మతం మారితేనే ఆహారం పెడతాం, మతం మారితేనే వైద్యం చేస్తాం” అని ప్రలోభపెట్టడం కచ్చితంగా రాజ్యాంగ విరుద్ధం.
దీన్ని అడ్డుకోవడానికే నిధుల లెక్కలు అడుగుతున్నారు. పారదర్శకత ఉంటే చారిటీ పేరుతో వస్తున్న డబ్బు నిజంగా దేవాదాయ పనులకు వాడుతున్నారా లేక మతమార్పిడులకు వాడుతున్నారా అనేది బయటపడుతుంది. నిజాయితీగా సేవ చేసేవారికి ఈ చట్టంతో ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
ప్రశ్న: కొందరు లాయర్లు వాళ్ళ భార్యల పేరు మీద ఎన్జీవోలు పెట్టి నిధులు తెచ్చుకుంటూ సుప్రీంకోర్టు పైనే ఒత్తిడి తెస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై న్యాయపరమైన మీ అభిప్రాయం?
హరీష్ సాల్వే: న్యాయవాదులు, వార్తా ఛానళ్లు విదేశీ నిధులు తీసుకోవడంపై స్పష్టమైన ఆంక్షలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్జీవోల ముసుగులో నిధులు తెచ్చుకునే వారు కూడా తాము తెచ్చుకున్న డబ్బు దేనికి వాడుతున్నారో లెక్కలు చూపించాల్సిందే. లాయర్ భార్య పేరు మీద ఎన్జీవో ఉంటే, ఆ డబ్బు సామాజిక సేవకు వాడారా? లేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారులకు భోజనాలు పెట్టడానికి, ఆందోళనలు నిర్వహించడానికి వాడారా? అనేది స్పష్టంగా బయటకు వస్తుంది.
ప్రశ్న: ఆఫ్రికాలో సోమాలియా, కాంగో లాంటి ఎన్నో పేద దేశాలు ఉన్నాయి. వాటిని వదిలేసి, పాశ్చాత్య దేశాలు భారతదేశంలోని స్వచ్ఛంద సంస్థలకే ఎందుకు అంతగా విరాళాలు ఇస్తున్నాయి అంటారు?
హరీష్ సాల్వే: ఇక్కడే మనం వాస్తవాలను గమనించాలి. పశ్చిమ దేశాల్లో, ముఖ్యంగా అమెరికా, ఐరోపాల్లో వారికి సొంత ఆర్థిక, సామాజిక సమస్యలు ఎన్నో ఉన్నాయి. లండన్ లోని ఖరీదైన వీధుల్లో పట్టపగలే దొంగతనాలు, కత్తిపోట్లు జరుగుతున్నాయి. స్వయంగా మా ఆవిడ కూడా ఒకసారి లండన్ లో దాడికి గురైంది. వాళ్ళ సొంత దేశాల్లోనే వాళ్ళు శాంతిభద్రతలు, పరిస్థితులు చక్కదిద్దుకోలేకపోతున్నారు. అలాంటిది భారతదేశం పై వాళ్లకు అంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది?
ఆఫ్రికా దేశాల ప్రజల కష్టాలు చూసి వాళ్ళ మనసు కరగదు, కానీ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, భవిష్యత్ సూపర్ పవర్‌గా ఎదుగుతున్న భారత్ పైనే వాళ్ళకెందుకు ఈ ప్రేమ? ఇదంతా కేవలం మన అభివృద్ధిని అడ్డుకోవడానికి చేసే కుట్ర. గతంలో నర్మదా బచావో ఆందోళన పేరిట ప్రపంచ బ్యాంకు లోన్ రాకుండా ఈ ఎన్జీవోలే ఎలా అడ్డుకున్నాయో మనం కళ్లారా చూశాం.
విదేశీ శక్తుల కనుసన్నల్లో పనిచేస్తూ, దేశ అభివృద్ధిని అడ్డుకునే ఏ సంస్థ అయినా ఇకపై జవాబుదారీగా ఉండాల్సిందేనని హరీష్ సాల్వే మాటల ద్వారా స్పష్టమవుతోంది. ఈ ఎఫ్ సి ఆర్ ఎ సవరణ చట్టం అనేది కేవలం ఒక ఆర్థిక చట్టం మాత్రమే కాదని, ఇది భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసే శక్తుల నుండి దేశాన్ని కాపాడుకోవడానికి జాతికి ఇవ్వబడిన ఒక “మేల్కొలుపు” అని ఆయన విశ్లేషణ తేటతెల్లం చేస్తోంది.







