సీనియర్ సిటిజన్లే సైబర్ కేటుగాళ్ల టార్గెట్.
* 19 నెలల్లో రూ.102.02 కోట్లు హాంఫట్.
* డిజిటల్ అరెస్ట్, ట్రేడింగ్, ఓటీపీ, డేటింగ్ మోసాలతో వృద్ధులకు వల.
* అప్రమత్తంగా ఉండాలన్న సీపీ సజ్జనార్.
హైదరాబాద్, మహా .
సీనియర్ సిటిజన్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త మోసాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. 2025 జనవరి నుంచి 2026 జూలై 31 వరకు 19 నెలల వ్యవధిలో సీనియర్ సిటిజన్లకు సంబంధించి 403 సైబర్ కేసులు నమోదయ్యాయని, ఈ మోసాల్లో బాధితులు ఏకంగా రూ.102.02 కోట్లు నష్టపోయారని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. వృద్ధుల ఒంటరితనం, సాంకేతిక పరిజ్ఞానంపై పరిమిత అవగాహనను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు భారీగా డబ్బులు కొల్లగొడుతున్నారని వివరించారు.
ఈ 19 నెలల్లో ట్రేడింగ్ మోసాల్లో 113 కేసులు నమోదయ్యాయని, బాధితులు రూ.55.88 కోట్లు నష్టపోయారని సజ్జనార్ తెలిపారు. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, భారీ లాభాలు, పెట్టుబడుల పేరుతో ముందుగా పరిచయం పెంచుకుని ఆ తర్వాత నకిలీ యాప్‌ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. యాప్‌లో భారీ లాభాలు వచ్చినట్లు చూపించి మరింత పెట్టుబడి పెట్టేలా చేసి చివరకు మొత్తం సొమ్మును కాజేస్తున్నారని వివరించారు.
డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.31.93 కోట్లు
పోలీసులు, సీబీఐ, ఈడీ, కస్టమ్స్ అధికారులమంటూ వీడియో కాల్స్ చేసి బెదిరించడం ద్వారా డబ్బులు వసూలు చేస్తున్న డిజిటల్ అరెస్ట్ మోసాల్లో 69 కేసులు నమోదయ్యాయని సీపీ తెలిపారు. ఈ తరహా మోసాల్లో సీనియర్ సిటిజన్లు రూ.31.93 కోట్లు కోల్పోయారని వెల్లడించారు. కేసులు, అరెస్టులు, మనీలాండరింగ్ వంటి అంశాల పేరుతో భయభ్రాంతులకు గురిచేసి బాధితుల నుంచి భారీ మొత్తాలను బదిలీ చేయించుకుంటున్నారని చెప్పారు.
ఓటీపీ మోసాలకు సంబంధించి 115 కేసులు నమోదయ్యాయని, వీటిలో రూ.4.94 కోట్లు నష్టపోయినట్లు తెలిపారు. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, పెట్టుబడులపై భారీ రాబడుల పేరుతో సాగుతున్న ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌లలో 22 కేసులు నమోదయ్యాయని, బాధితులు రూ.2.79 కోట్లు నష్టపోయారని వివరించారు.
డేటింగ్ యాప్స్‌తోనూ వల
సీనియర్ సిటిజన్ల ఒంటరితనాన్ని కూడా సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని సజ్జనార్ తెలిపారు. సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయం పెంచుకుని గిఫ్టులు, కస్టమ్స్ డ్యూటీ, అత్యవసర ఖర్చుల పేరుతో డబ్బులు అడుగుతున్నారని చెప్పారు. డేటింగ్ ఫ్రాడ్, హనీట్రాప్ కేసుల్లో 7 కేసులు నమోదై, రూ.70.11 లక్షలకు పైగా బాధితులు నష్టపోయారని వెల్లడించారు. పరువు పోతుందనే భయంతో కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని పేర్కొన్నారు.
ఫిర్యాదు అందగానే ఖాతాలు ఫ్రీజ్
2025లో సీనియర్ సిటిజన్లకు సంబంధించిన 285 సైబర్ కేసుల్లో రూ.71.81 కోట్లు, 2026 తొలి ఏడు నెలల్లో నమోదైన 118 కేసుల్లో రూ.30.20 కోట్లు నష్టపోయినట్లు సజ్జనార్ తెలిపారు. అయితే పోలీసుల అవగాహన కార్యక్రమాలతో నెలవారీ కేసుల సంఖ్య 24 నుంచి 17కు తగ్గిందని చెప్పారు.
బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసి, సొమ్ము రికవరీకి వేగంగా చర్యలు తీసుకుంటున్నామని సీపీ వివరించారు. సీనియర్ సిటిజన్ల ఫోన్ వినియోగం, ఆన్‌లైన్ లావాదేవీలపై కుటుంబ సభ్యులు కూడా దృష్టి పెట్టాలని సూచించారు. అపరిచితుల నుంచి వచ్చే వీడియో కాల్స్, లింకులు, పెట్టుబడి ఆఫర్లు, ఓటీపీ అభ్యర్థనలు, డిజిటల్ అరెస్ట్ బెదిరింపులను నమ్మవద్దని స్పష్టం చేశారు.







