Mahaa Daily Exclusive

  రూ.54 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత…

Share

రూ.54 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత.
• యాదాద్రి భువనగిరిలో 27 కిలోల మెఫెడ్రోన్‌ స్వాధీనం.. నలుగురు అరెస్టు.
యాదాద్రి భువనగిరి, మహా.

యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీసులు భారీ డ్రగ్స్‌ రాకెట్‌ను ఛేదించారు. బీబీనగర్‌ మండలం కొండమడుగు సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రూ.54 కోట్ల విలువైన 27 కిలోల మెఫెడ్రోన్‌ (ఎండీ)ను స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాల తయారీలో ఉపయోగించే 40 కిలోల ద్రవ రూపంలోని ఎసిటోన్‌ను కూడా పోలీసులు సీజ్‌ చేశారు. ఈ వ్యవహారంలో నలుగురిని అరెస్టు చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
అరెస్టయిన వారిలో చేతన్‌ మధుకర్‌, ముజమ్మిల్‌ హక్‌, అశోక్‌ గవాండే, రమణమూర్తి ఉన్నారు. పరారీలో ఉన్న ఎండీ అయూబ్‌, ప్రదీప్‌ ఠాకూర్‌, గోపాల్‌ సిర్పత్‌ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
ల్యాబ్‌లోనే మెఫెడ్రోన్‌ తయారీ
కొండమడుగులోని వెటుకూరి ల్యాబ్స్‌లో మెఫెడ్రోన్‌ను అక్రమంగా తయారు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అక్కడ తయారు చేసిన మాదకద్రవ్యాలను వివిధ మార్గాల్లో తరలిస్తున్న ముఠా.. తాజాగా నాగ్‌పూర్‌కు పంపించేందుకు సిద్ధం చేస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది.
స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌, రసాయనాలతో పాటు నిందితుల నుంచి ఇతర ఆధారాలను కూడా పోలీసులు సేకరించినట్లు సమాచారం. ఈ ముఠా గతంలో ఎక్కడెక్కడ డ్రగ్స్‌ సరఫరా చేసింది? ఎవరెవరికి విక్రయించింది? ల్యాబ్‌ నిర్వహణ వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
మెఫెడ్రోన్‌ తయారీ, సరఫరాతో సంబంధం ఉన్న మొత్తం నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తును విస్తరించారు. పరారీలో ఉన్న ముగ్గురిని పట్టుకుంటే డ్రగ్స్‌ తయారీ, సరఫరాకు సంబంధించిన మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.