Mahaa Daily Exclusive

  ఇండోనేసియాలో భారీ భూకంపం….

Share

  • ఇండోనేసియాలో భారీ భూకంపం
  • 38 మంది మృతి
  • సునామీ హెచ్చరికలు జారీ
  • రిక్టర్‌ స్కేల్‌పై 7.7 తీవ్రతతో ప్రకంపనలు

మహా : ఇండోనేసియాలో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 7.7 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5.58 గంటలకు ఫ్లోరెస్‌ ప్రాంతంలో ఈ భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే (యూఎస్​జీఎస్​) తెలిపింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ ప్రమాదంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పు నుసా తెంగారా ప్రావిన్స్‌లోని ఎండే నగరానికి సుమారు 68 కిలోమీటర్ల ఉత్తర-వాయువ్య దిశలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రకంపనల తీవ్రత దృష్ట్యా ఇండోనేసియా అధికారులు పలు ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తూర్పు నుసా తెంగారా, పశ్చిమ నుసా తెంగారా, దక్షిణ సులవేసి, ఆగ్నేయ సులవేసి ప్రావిన్సుల్లోని తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీచ్‌లు, నదీ తీరాలకు దూరంగా ఉండటంతో పాటు, అవసరమైతే వెంటనే ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు.

ప్రధాన భూకంపం తర్వాత అదే ప్రాంతంలో పలు ప్రకంపనలు సంభవించాయి. వీటిలో 6.1 తీవ్రతతో కూడిన ప్రకంపన కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఫ్లోరెస్‌ ద్వీపంలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సునామీ హెచ్చరికల నేపథ్యంలో వందలాది మంది ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లినట్లు యూఎస్‌జీఎస్‌, ఇండోనేసియా అధికారులు తెలిపారు. తీర ప్రాంతాల్లో సముద్రపు అలల తీరును అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని అన్నారు.

ఎత్తైన ప్రాంతాలకు పరుగులు

అయితే భూకంపం కారణంగా ప్రాణనష్టం, గాయపడిన వారి సంఖ్యపై అధికారిక వివరాలు ఇంకా వెలువడలేదు. సిక్కా ప్రాంతానికి చెందిన యోహన్నా ఎంబు మాట్లాడుతూ, భూకంపం వల్ల అనేక భవనాలు దెబ్బతిన్నాయని, భయపడిన ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు పరుగులు తీశారని తెలిపారు. మౌమెరేలోని పెల్నీ పోర్ట్ టెర్మినల్‌ వద్ద వెయిటింగ్‌ రూమ్‌ కూలిపోవడాన్ని తాను చూసినట్లు చెప్పారు. స్థానిక ఆసుపత్రిలో పనిచేస్తున్న 31 ఏళ్ల లూకాస్‌ లోటార్‌ కూడా భూకంప సమయంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురైనట్లు తెలిపారు. అకస్మాత్తుగా భూమి కంపించడంతో ఆసుపత్రి పరిసరాల్లో ఉన్నవారు బయటకు పరుగులు తీశారని చెప్పారు. అనంతర ప్రకంపనలు కూడా ప్రజల్లో ఆందోళనను మరింత పెంచాయి.

ఇండోనేసియా వాతావరణ, శీతోష్ణస్థితి, భూభౌతిక శాస్త్ర సంస్థ సునామీ ముప్పును దృష్టిలో ఉంచుకుని ప్రజలకు పలు సూచనలు చేసింది. సముద్ర తీరాలు, నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్లవద్దని, తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు తరలివెళ్లాలని సూచించింది. సునామీ హెచ్చరికలు పూర్తిగా ఉపసంహరించే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అలల కొలమాన పరికరాల ద్వారా సముద్ర మట్టంలో మార్పులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Latest