Mahaa Daily Exclusive

  యూజీసీ–నెట్‌లో వరుస తప్పిదాలు..! ఎన్‌టీఏపై కేంద్రం సర్జికల్ స్ట్రైక్..!

Share

  • ఎన్‌టీఏపై కేంద్రం సర్జికల్ స్ట్రైక్!
  • 50 మందికి పైగా సిబ్బందిపై వేటు.
  •  10 కీలక కొత్త పోస్టులు.. ఇక పరీక్షల భద్రతపై నిఘా.

ఢిల్లీ, మహా.

యూజీసీ–నెట్‌ పరీక్షలో వరుసగా వెలుగుచూస్తున్న లోపాలు, పలు పరీక్షల పునఃనిర్వహణ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ ఎన్‌టీఏ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. పరీక్షల నిర్వహణలో నాణ్యత, పారదర్శకత, భద్రతను మరింత పటిష్ఠం చేసే దిశగా భారీ మార్పులకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఎన్‌టీఏలో 50 మందికి పైగా సిబ్బందిని తొలగించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వారి స్థానంలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారిని నియమించేందుకు 10 కీలక వృత్తిపరమైన పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
ఈ అంశంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి దీప్తి గౌర్‌ ముఖర్జీ, ఎన్‌టీఏ డైరెక్టర్‌ జనరల్‌ అభిషేక్‌ సింగ్‌, ఇతర ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి ఎన్‌టీఏ చేపడుతున్న సంస్కరణలను అధికారులు మంత్రికి వివరించారు.

ఎన్‌టీఏలో కీలక మార్పులు.

ఇప్పటి వరకు కొనసాగుతున్న వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి, పరీక్షల నిర్వహణలో ప్రత్యేక నైపుణ్యం ఉన్న అధికారులను తీసుకురావాలని ఎన్‌టీఏ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రధాన సాంకేతిక అధికారి, ప్రధాన ఆర్థిక అధికారి, ప్రధాన సమాచార భద్రతా అధికారి, పరీక్షా భద్రత విభాగం జనరల్‌ మేనేజర్‌, పరిశోధన–అభివృద్ధి, మానసిక కొలమానాల విభాగం జనరల్‌ మేనేజర్‌ తదితర కీలక పోస్టులను భర్తీ చేయనున్నారు.
అంతేకాకుండా ప్రశ్నపత్రాల రూపకల్పన, సైబర్‌ భద్రత, పరీక్షా భద్రత, విద్యా పరిశోధన వంటి ప్రత్యేక రంగాల్లో ప్రైవేటు రంగానికి చెందిన నిపుణుల సేవలను కూడా వినియోగించుకునే అవకాశం ఉంది.

పరీక్షా భద్రతపై సమూల ప్రక్షాళన.

పరీక్షల నిర్వహణలో నిర్దేశిత నిబంధనలను కచ్చితంగా పాటించాలని మంత్రి ప్రహ్లాద్‌ జోషి అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన గోప్య కార్యకలాపాల వ్యవస్థను పూర్తిస్థాయిలో సమీక్షించాలని సూచించారు. ఎన్‌టీఏ నిర్వహిస్తున్న అన్ని పరీక్షా ప్రక్రియలపై సమగ్ర ఆడిట్‌ నిర్వహించి, లోపాలను గుర్తించి, వాటి నివారణకు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
ప్రశ్నపత్రం తయారీ నుంచి పరీక్ష నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల ప్రకటన వరకు ప్రతి దశలోనూ భద్రతను బలోపేతం చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. లోపం జరిగిన తర్వాత స్పందించడం కాకుండా.. లోపానికి అవకాశం లేకుండా వ్యవస్థను రూపొందించడమే లక్ష్యంగా ఎన్‌టీఏ పనిచేయాలని మంత్రి దిశానిర్దేశం చేశారు.

యూజీసీ–నెట్‌లో తప్పులపై కమిటీ.. మూడు పరీక్షలకు మళ్లీ పరీక్ష.

ఇటీవల యూజీసీ–నెట్‌లో ఇంగ్లిష్‌, కామర్స్‌, సోషియాలజీ ప్రశ్నపత్రాల్లో పలు తప్పులు ఉన్నాయంటూ అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఎన్‌టీఏ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ప్రశ్నపత్రాలను పరిశీలించింది.
కమిటీ పరిశీలనలో వాస్తవిక తప్పులు, ముద్రణ దోషాలు, అనువాద లోపాలు, ప్రశ్నల రూపకల్పనలో పొరపాట్లు, వ్యాకరణ–విరామచిహ్నాల సమస్యలు, స్పష్టత లేని పదజాలం వంటి అనేక లోపాలు గుర్తించినట్లు సమాచారం. కొంతమంది ప్రముఖుల పేర్లు తప్పుగా ఉండటం, పుస్తకాల శీర్షికలు స్పష్టంగా లేకపోవడం వంటి సమస్యలను కూడా కమిటీ గుర్తించింది.
అంతేకాకుండా గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నల్లో గణనీయమైన సంఖ్యలో ప్రశ్నలు మళ్లీ రావడాన్ని కూడా కమిటీ పరిశీలించినట్లు తెలుస్తోంది. దీంతో అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు, పరీక్షను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు మూడు సబ్జెక్టుల పరీక్షలను మరోసారి నిర్వహించాలని కమిటీ సిఫారసు చేసింది.

సెప్టెంబరు 9, 10న రీటెస్ట్‌.

కమిటీ సిఫారసుల మేరకు సెప్టెంబరు 9న ఇంగ్లిష్‌, కామర్స్‌, సెప్టెంబరు 10న సోషియాలజీ పరీక్షలను మరోసారి నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ ఇప్పటికే ప్రకటించింది. ఇంగ్లిష్‌ పరీక్ష ఉదయం, కామర్స్‌ పరీక్ష మధ్యాహ్నం నిర్వహించనుండగా.. సోషియాలజీ పరీక్ష సెప్టెంబరు 10న ఉదయం జరుగుతుంది.
రీటెస్ట్‌కు హాజరయ్యే అభ్యర్థులు మళ్లీ ఎలాంటి అదనపు పరీక్షా రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. పరీక్ష కేంద్రాలు, ప్రవేశపత్రాలకు సంబంధించిన వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.

ఇకపై ‘తప్పిదాలకు తావులేని’ పరీక్షలే?

యూజీసీ–నెట్‌ సహా కీలక జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో వరుసగా సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. సిబ్బంది ప్రక్షాళన నుంచి ప్రత్యేక నిపుణుల నియామకం వరకు.. పరీక్షా భద్రత నుంచి ప్రశ్నపత్రాల నాణ్యత వరకు ఎన్‌టీఏలో సమూల మార్పులకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే జాతీయ స్థాయి పరీక్షల్లో చిన్నపాటి తప్పిదం కూడా వేలాది మంది అభ్యర్థులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున.. ఇకపై ప్రతి దశను అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించడమే కేంద్రం ముందున్న ప్రధాన సవాలుగా మారింది.

Latest