Mahaa Daily Exclusive

  ఉరిశిక్షకు ప్రత్యామ్నాయం కుదరదు..! సుప్రీంకోర్టు కీలక తీర్పు!

Share

  •  సుప్రీంకోర్టు కీలక తీర్పు!
  •  తక్కువ బాధ కలిగించే పద్ధతి’ కోరిన పిటిషన్‌ తిరస్కరణ.
  •  ప్రస్తుతం ఉరితీయడమే అమలు విధానం అని స్పష్టీకరణ.

ఢిల్లీ, మహా.
ఉరిశిక్ష అమలు చేసే విధానంపై దాఖలైన కీలక పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఉరిశిక్ష రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేసిన అత్యున్నత న్యాయస్థానం.. ప్రస్తుతం దేశంలో మరణశిక్ష అమలు చేసే విధానంగా ఉరితీయడమే కొనసాగుతుందని తేల్చిచెప్పింది. ఉరితీయడానికి బదులుగా దోషికి తక్కువ బాధ కలిగించే విధంగా విషపు ఇంజెక్షన్‌ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.

ఉరిశిక్ష అమలు విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉందని, దోషి గౌరవాన్ని కాపాడే విధంగా తక్కువ బాధతో మరణశిక్ష అమలు చేయాలని పిటిషన్‌లో కోరారు. అయితే ప్రస్తుత చట్టపరమైన పరిస్థితుల్లో ఉరిశిక్ష అమలు విధానాన్ని మార్చేందుకు తగిన ఆధారాలు లేవని ధర్మాసనం పేర్కొంది.

పాత తీర్పులను విస్తృత ధర్మాసనానికి పంపాలన్న అభ్యర్థన తిరస్కరణ

ఉరిశిక్షకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మూడు తీర్పులను విస్తృత ధర్మాసనానికి నివేదించాలని పిటిషనర్‌ కోరారు. అయితే ఆ అభ్యర్థనను కూడా ధర్మాసనం తిరస్కరించింది. గత తీర్పులను పునఃపరిశీలించేందుకు లేదా విస్తృత ధర్మాసనానికి పంపేందుకు తగిన కారణాలు కనిపించడం లేదని స్పష్టం చేసింది.

విషపు ఇంజెక్షన్‌ నుంచి విద్యుదాఘాతం వరకు..

న్యాయవాది రిషి మల్హోత్రా దాఖలు చేసిన పిటిషన్‌లో ఉరిశిక్షకు ప్రత్యామ్నాయంగా విషపు ఇంజెక్షన్‌, కాల్చివేత, విద్యుదాఘాతం, వాయు గది వంటి పద్ధతులను పరిశీలించాలని కోరారు. ఉరిశిక్ష అత్యంత బాధాకరమైనది, అమానుషమైనది, క్రూరమైనదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఉరిశిక్ష విధించే విధానాన్ని నిర్దేశించే క్రిమినల్‌ ప్రొసీజర్‌ చట్టంలోని నిబంధనను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని, గౌరవప్రదమైన మరణాన్ని పొందే హక్కును రాజ్యాంగంలోని 21వ అధికరణం కింద ప్రాథమిక హక్కుగా గుర్తించాలని పిటిషనర్‌ కోరారు.

ఉరిశిక్ష అనంతరం మరణాన్ని నిర్ధారించేందుకు ఎక్కువ సమయం పడుతుందని, ప్రత్యామ్నాయ పద్ధతుల్లో తక్కువ సమయంలోనే ప్రక్రియ పూర్తవుతుందని పిటిషన్‌లో వాదించారు. మరణశిక్ష అమలు చేయాల్సిన పరిస్థితుల్లో సాధ్యమైనంత తక్కువ బాధ కలిగించే విధానాన్ని అనుసరించాలన్న అంతర్జాతీయ తీర్మానాలను కూడా పిటిషనర్‌ తన వాదనలకు ఆధారంగా ప్రస్తావించారు.

ప్రస్తుతానికి ఉరితీయడమే కొనసాగింపు

అయితే సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో దేశంలో మరణశిక్ష అమలు చేసే ప్రస్తుత విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టమైంది. ఉరిశిక్ష రాజ్యాంగబద్ధమేనని, ప్రస్తుతం చట్టం నిర్దేశించిన విధంగా ఉరితీయడమే మరణశిక్ష అమలు పద్ధతిగా కొనసాగుతుందని ధర్మాసనం తేల్చిచెప్పింది.

Latest