చెన్నై, మహా.
సిద్ధాంత స్పష్టత, క్రమశిక్షణ, నిరంతర అభ్యాసం, ప్రజాసేవ పట్ల నిబద్ధతతోనే బలమైన రాజకీయ సంస్థ నిర్మాణమవుతుందని బీజేపీ జాతీయ నాయకుడు, తమిళనాడు–కర్ణాటక రాష్ట్రాల కో ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. చెన్నైలోని పల్లవరంలోని అరుల్ మురుగన్ హాల్‌లో నిర్వహించిన తమిళనాడు బీజేపీ రాష్ట్రస్థాయి ‘దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్’ కార్యక్రమంలో ఆయన పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
బీజేపీ సంస్థాగత సంస్కృతిలో శిక్షణకు ప్రత్యేక స్థానం ఉందని సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ప్రతిపాదించిన ఏకాత్మ మానవతావాదం, అంత్యోదయ సిద్ధాంతాలను కార్యకర్తలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సమాజంలోని చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు చేరినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అంత్యోదయ స్ఫూర్తితో సంక్షేమం, మౌలిక వసతులు, సాధికారత, ఆర్థిక అవకాశాలు, సమ్మిళిత అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా ఏడాది పొడవునా ప్రజలతో మమేకమై పనిచేసే అంకితభావ కార్యకర్తలే బీజేపీకి అతిపెద్ద బలమని ఆయన అన్నారు. తమిళనాడుకు భారత నాగరికతా ప్రస్థానంలో ప్రత్యేక స్థానం ఉందని పేర్కొంటూ.. తమిళ గుర్తింపు, భారతీయ గుర్తింపు పరస్పరం బలపరిచేవేనని తెలిపారు. తమిళనాడు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, జాతీయ వారసత్వానికి అందించిన అపారమైన సేవలను కార్యకర్తలు ప్రజలకు వివరించాలని సూచించారు.
రాష్ట్రం నుంచి జిల్లా, మండల, బూత్ స్థాయి వరకు పార్టీ సంస్థను మరింత బలోపేతం చేయాలని సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. యువత, మహిళలు, రైతులు, మత్స్యకారులు, కార్మికులు, పారిశ్రామికవేత్తలు సహా అన్ని వర్గాలతో ప్రత్యక్ష సంబంధాలను పెంచుకోవాలని సూచించారు. వాస్తవ ఆధారాలతో నిర్మాణాత్మకంగా మాట్లాడటం, సాంకేతికత, సామాజిక మాధ్యమాలను సమర్థంగా వినియోగించడం ద్వారా యువతను పార్టీతో అనుసంధానం చేయాలని కోరారు. అదే సమయంలో పార్టీ సిద్ధాంతాలు, విలువలకు కార్యకర్తలు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.
సంస్థ వ్యక్తుల కంటే ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలని, పదవులు వ్యక్తిగత హోదాకు ప్రతీకలు కాదని, ప్రజాసేవకు అప్పగించిన బాధ్యతలని సుధాకర్‌రెడ్డి అన్నారు. శిక్షణ మహాభియాన్ ద్వారా ‘దేశం ప్రథమం, స్వార్థం కంటే సంస్థ మిన్న, అంత్యోదయమే లక్ష్యం, సేవే సంస్కృతి, వికసిత్ భారత్ సాధనే గమ్యం’ అనే ఐదు మార్గదర్శక సూత్రాలను కార్యకర్తలు ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. శిక్షణ పొందిన, క్రమశిక్షణతో కూడిన, సిద్ధాంత నిబద్ధత కలిగిన కార్యకర్తలతో తమిళనాడులో బీజేపీ మరింత బలోపేతమవుతుందని, వికసిత్ భారత్ నిర్మాణంలో పార్టీ కీలకంగా పనిచేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, తమిళనాడు బీజేపీ ఇన్‌చార్జి అరవింద్ మీనన్, రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్‌తో పాటు రాష్ట్ర పదాధికారులు, కార్యదర్శులు, మోర్చా నాయకులు, సీనియర్ నేతలు, తమిళనాడు వ్యాప్తంగా కార్యకర్తలు పాల్గొన్నారు.






