Mahaa Daily Exclusive

  ‘భూలక్ష్మి’తో పేదలకు భూమి..! కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన..!

Share

  •  కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన.
    అధికారంలోకి వస్తే భూమిలేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం.
  •  అమలు చేస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వానికే మద్దతు.

హైదరాబాద్‌, మహా.

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక హామీ తెరపైకి వచ్చింది. తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత భూమిలేని పేద కుటుంబాలకు ఎకరం భూమి పంపిణీ చేసే ‘భూలక్ష్మి’ పథకాన్ని ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని భూమిలేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం చొప్పున భూమి అందిస్తామని ఆమె తెలిపారు. పేదల ఆర్థిక స్వావలంబనకు భూమి శాశ్వత ఆధారంగా నిలుస్తుందన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రతిపాదిస్తున్నట్లు వెల్లడించారు.

హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడుతూ.. పేదల జీవన ప్రమాణాల్లో శాశ్వత మార్పు తీసుకురావాలంటే కేవలం ఆర్థిక సహాయం, సంక్షేమ పథకాలు అందించడం సరిపోదన్నారు. వారి చేతిలో సొంత ఆస్తి ఉండేలా చేయడం ద్వారా ఆర్థిక భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి అందించడం ద్వారా వారి ఆత్మగౌరవాన్ని పెంచడంతో పాటు, భవిష్యత్‌ తరాలకు కూడా భరోసా కల్పించవచ్చని అన్నారు.

పేదల ఆత్మగౌరవమే లక్ష్యం

పేదలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు వారు సొంత కాళ్లపై నిలబడేలా చేయడమే తమ రాజకీయ లక్ష్యమని కవిత స్పష్టం చేశారు. భూమి వంటి శాశ్వత ఆస్తి అందుబాటులో ఉంటే పేద కుటుంబాలు వ్యవసాయం ద్వారా ఆదాయం పొందడంతో పాటు ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందని అన్నారు.

సమాజంలో వెనుకబడిన వర్గాలకు భరోసా కల్పించడంతో పాటు వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ‘భూలక్ష్మి’ పథకం దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు.

‘కాంగ్రెస్‌ అమలు చేస్తే స్వాగతిస్తాం’

ఇదే సమయంలో అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కవిత ఒక కీలక సవాల్‌ విసిరారు. భూమిలేని పేద కుటుంబాలకు ఎకరం భూమి అందించే ‘భూలక్ష్మి’ పథకాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడే అమలు చేయడానికి ముందుకు వస్తే తమ పార్టీ తరఫున మొదటగా స్వాగతించి, సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారు.

పేదల సంక్షేమం విషయంలో రాజకీయ విభేదాల కంటే ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె సూచించారు. పేద కుటుంబాలకు శాశ్వత ఆస్తి కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

Latest