- 1937 నాటి నిర్ణయాన్ని మళ్లీ తెరపైకి తేవడం దేశాన్ని అవమానించడమే.
- సంతుష్టీకరణ విధానాలతోనే విభజన.. ప్రజలు వ్యతిరేకించాలి.
ఢిల్లీ, మహా.
జాతీయ గేయం ‘వందేమాతరం’ విషయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘వందేమాతరం’లో తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని కాంగ్రెస్ నిర్ణయించడం దేశ ప్రజల మనోభావాలను అవమానించడమేనని ఆయన విమర్శించారు. 1937లో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు మళ్లీ ముందుకు తీసుకురావడం సరైన విధానం కాదని అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
‘వందేమాతరం’ కేవలం ఒక గేయం కాదని.. స్వాతంత్య్రోద్యమ కాలంలో కోట్లాది భారతీయుల్లో జాతీయ చైతన్యాన్ని రగిలించిన నినాదమని అమిత్‌షా పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలతో ముడిపడిన గేయం విషయంలో రాజకీయ ప్రయోజనాల కోసం వివాదాన్ని సృష్టించడం తగదని అన్నారు.
‘చారిత్రక తప్పిదాన్ని పునరావృతం చేస్తున్నారు’
1937లో కాంగ్రెస్ అనుసరించిన విధానాన్ని ఇప్పుడు మళ్లీ పునరావృతం చేస్తోందని అమిత్‌షా ఆరోపించారు. అప్పట్లో సంతుష్టీకరణ రాజకీయాల కారణంగానే ‘వందేమాతరం’ను కొన్ని భాగాలకే పరిమితం చేశారని విమర్శించారు. అదే నిర్ణయాన్ని ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వం మరోసారి ముందుకు తీసుకురావడం దురదృష్టకరమని అన్నారు.
కాంగ్రెస్ గతంలో చేసిన తప్పుల నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని అమిత్‌షా విమర్శించారు. దేశ విభజనకు దారితీసిన పరిస్థితుల్లో అప్పటి కాంగ్రెస్ విధానాలు కూడా ఒక కారణమని ఆరోపించారు. ఇప్పుడు ‘వందేమాతరం’ విషయంలోనూ అదే తరహా సంతుష్టీకరణ రాజకీయాలను అనుసరిస్తున్నారని మండిపడ్డారు.
‘ప్రజలు గళమెత్తాలి’
‘వందేమాతరం’పై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం రాజకీయ పార్టీల మధ్య వివాదంగా చూడకూడదని అమిత్‌షా అన్నారు. ఇది దేశ ప్రజల భావోద్వేగాలకు, జాతీయ గౌరవానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు. కాంగ్రెస్ నిర్ణయాన్ని ప్రజలు ప్రశ్నించాలని, జాతీయ గేయం గౌరవాన్ని కాపాడేందుకు ప్రజలు తమ గళాన్ని వినిపించాలని పిలుపునిచ్చారు.
బంకించంద్ర ఛటర్జీ రచించిన ‘వందేమాతరం’ స్వాతంత్య్రోద్యమంలో కీలక పాత్ర పోషించిందని గుర్తుచేస్తూ.. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు ఈ గేయాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారని అమిత్‌షా పేర్కొన్నారు. అలాంటి గేయం విషయంలో విభజనాత్మక రాజకీయాలకు తావివ్వడం తగదని అన్నారు.
దక్షిణాది పర్యటనలో పొంగులేటి సుధాకర్‌రెడ్డి
ఇదిలా ఉండగా, తమిళనాడులో జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు బీజేపీ జాతీయ నాయకుడు, తమిళనాడు–కర్ణాటక రాష్ట్రాల సహ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. ఉద్గమండలం బీజేపీ ఎమ్మెల్యే ఎం. భోజరాజన్‌తో కలిసి అమిత్‌షాకు ఆత్మీయ స్వాగతం అందించారు.
దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి, అంతర్రాష్ట్ర సమస్యలు, కేంద్ర–రాష్ట్రాల సమన్వయం వంటి కీలక అంశాలపై చర్చించేందుకు జరిగిన ఈ సమావేశానికి ముందు అమిత్‌షాకు లభించిన స్వాగత కార్యక్రమంలో సుధాకర్‌రెడ్డి పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.







