హైదరాబాద్, మహా : సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో తరహా మోసాలతో అమాయకులను నిండా ముంచుతున్నారు. తాజాగా ఓ ఆర్మీ మేజర్ భార్య ఫోటోలను మార్ఫింగ్ చేసిన సైబర్ ముఠా వేధింపులకు పాల్పడింది. ఈ ఘటనపై బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు హైదారాబాద్ సైబర్ పీఎస్‌లో కేసు నమోదైంది. సికింద్రాబాద్ నివాసి, ఆర్మీలో పని చేస్తున్న ఓ మేజర్ భార్య ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూలో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల సైబర్ మోసగాళ్లు ఆమెను టార్గెట్‌గా చేసుకొని సోషల్ మీడియాలోని ఆమె వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను సేకరించి ఏఐ సాంకేతికతతో అసభ్యకరమైనవిగా మార్ఫింగ్ చేశారు.. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఆమె బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు పోస్టులు పెడుతూ డబ్బులు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. దీంతో మేజర్ స్వయంగా ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ సాంకేతిక పరికరాల ద్వారా పరిశోధన చేసి, నిందితులు ఉపయోగించిన సోషల్ మీడియా లింక్‌లను, అకౌంట్ల వివరాలతో సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇటువంటి ఘటనలు జరిగితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాలని సూచిస్తున్నారు.








