Mahaa Daily Exclusive

  ఏఈ హరి కుమార్ పై అవినీతి ఆరోపణలు..? గతంలో హరి పై కలెక్టర్ కు ఫిర్యాదు..మెమో జారీ చేయాలన్న కలెక్టర్..

Share

  • గతంలో హరి పై కలెక్టర్ కు ఫిర్యాదు..మెమో జారీ చేయాలన్న కలెక్టర్
  • సుముఖత చూపని ఉన్నతాధికారులు..ముందుకు పోని విచారణ
  • బిల్లుల వ్యవహారంలో ఆన్లైన్ లో రూ.5 లక్షల కమిషన్
  • కమీషన్ వ్యవహారం పై కమిషనర్ దృష్టి

వరంగల్‌, కార్పొరేషన్ మహా;

వరంగల్ బల్దియా ఇంజినీరింగ్ విభాగం నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే విషయంలోనూ, అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమైందని నగర ప్రజలు చెప్పకనే చెబుతున్నారు. గతంలో అధికారి పై మొదలైన బిల్లుల ముందస్తు కమిషన్ పై అవినీతి ఆరోపణల భాగోతం మరలా తెరపైకి వచ్చింది. అధికారి హరి కుమార్‌ అంటే ఉన్నతాధికారులు ఎందుకు కంగు తింటున్నారనే ప్రశ్నలు ఉద్యోగుల మధ్య గుసగుసలు వినిపిస్తున్నాయి. హరి పై గతంలోనే
ఓ కాంట్రాక్టర్‌
కలెక్టరేట్‌ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.. దీనిపై హరికుమార్ కు మెమో జారీ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారని సమాచారం. ఐన్నప్పటికీ హరి పై ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు తీసుకోక పోవడం పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ఈ అంశం పై విచారణ కూడా ముందుకు పోకపోవడం బల్దియా ఇంజినీరింగ్ విభాగంలో హరి కున్న పలుకుబడికి నిదర్శనమని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా అభివృద్ధి పనుల విషయం లోనూ మరలా ఆయన పై తీవ్రమైన ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది.
అయితే కలెక్టర్ ఆదేశాల మేరకు మెమో జారీ చేశారా? ఫిర్యాదు పై విచారణ చేపట్టారా? అన్నది ఇప్పటికీ స్పష్టత లేదని తెలుస్తోంది. జిల్లా కలెక్టర్‌ నుంచి ఆదేశాలు వచ్చినా వాటిని అమలు చేయడంలో ఉన్నతాధికారులు ఎందుకు జాప్యం జరుగుతోందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఫిర్యాదులోని అంశాలు నిజమో కాదో తేల్చేందుకు విచారణ జరపాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం పై బల్దియా లో చర్చ జోరుగా సాగుతోంది.

*తాజా బిల్లుల వ్యవహారం లోనూ ఆరోపణలు*

గత అవినీతి ఆరోపణల వ్యవహారం అంతా మరువక ముందే తాజాగా అభివృద్ధి పనులకు సంబంధించిన అంశంలోనూ హరికుమార్‌ పై మరోసారి ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనులు చేయకుండానే బిల్లులు పొందేందుకు ప్రయత్నాలు జరిగాయన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో ఓ కాంట్రాక్టర్‌ నుంచి ఆన్లైన్ ద్వారా రూ.5 లక్షలు ముందుగానే కమీషన్ తీసుకున్నారన్న ఆరోపణల ప్రచారం జోరందుకుంది. కాగా ఈ ఆరోపణలకు అధికారిక నిర్ధారణ అవసరమని నిజంగా రూ.5 లక్షల లావాదేవీ జరిగిందా? లేదా ? ఒకవేళ జరిగితే ఎవరి ఖాతా నుంచి ఎవరి ఖాతాకు డబ్బులు బదిలీ అయ్యాయి? సంబంధిత అభివృద్ధి పనికి సంబంధించిన ఫైల్‌ లో ఏం ఉంది? పనులు పూర్తయ్యాయా? బిల్లుల ప్రక్రియ ఎక్కడ ఉంది? అనే అంశాల పై పూర్తి స్థాయిలో విచారణ చేపడితే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.

*ఈ అంశాలు కమిషనర్‌ దృష్టికి*

గతం లో జరిగిన బిల్లు పై ముందస్తు కమిషన్ అవినీతి బాగోతాన్ని పక్కన పెడితే అలాగే ప్రస్తుతం తాజా ఆరోపణల నేపథ్యంలో బల్దియా కమిషనర్‌ టి. వెంకన్న ఈ వ్యవహారం పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. హరికుమార్‌ పై వచ్చిన ఆరోపణలను పరిశీలించి చర్యల అంశాన్ని చూడాలని సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ ను ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఈసారైనా వ్యవహారం విచారణ దశ దాటి చర్యల వరకు వెళ్తుందా? అన్నది ఆసక్తికరమైన అంశంగా మారింది. గతంలో కలెక్టర్‌ ఆదేశాల అమలు, తాజాగా కమిషనర్‌ ఈ అంశంపై దృష్టి సారించినట్లు సమాచారం రావడంతో బల్దియా లో చర్చ మొదలైంది. ఒకవేళ ఆరోపణలు నిరాధారమైతే రికార్డులతో స్పష్టత ఇవ్వాలి.. నిజమైతే బాధ్యుల పై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఒకే అధికారి పై వరుస ఆరోపణలు వచ్చినా ఉన్నతాధికారులు ఎందుకు విచారణ జరపడం లేదన్న అనుమానాలు మరింత బలపడే అవకాశం లేకపోలేదు. చూడాలి గతంలో లాగానే అధికారుల పై అవినీతి ఆరోపణలు ఆరోపణలు రాగానే అవి విచారణకు కూడా నోచుకోకుండానే మరుగున పడిపోతాయా అన్నది వేచి చూడాలి.