- రాఖీ బంధం ప్రేమకు, ఆప్యాయతకు ప్రతీక
- ఆడబిడ్డలకు అన్నగా ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది
- రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క
హైదరాబాద్, మహా : రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ఆడబిడ్డలకు మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర నమ్మకానికి రాఖీ పండుగ ప్రతీక అని అన్నారు. తెలంగాణ ఆడబిడ్డలకు ఒక అన్నగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఒక మహిళ ఆర్థికంగా ఎదిగితే ఒక కుటుంబం బలపడుతుందని, లక్షలాది మహిళలు ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వాములైతే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తి వస్తుందని తెలిపారు. అందుకే అవకాశం ఉన్న అన్ని వ్యాపారాల్లో మహిళలకు ప్రొత్సహిస్తున్నామని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు ఇప్పటివరకు సుమారు రూ.70 వేల కోట్ల బ్యాంకు రుణాలు అందించామని, రూ.1,903 కోట్ల వడ్డీని తిరిగి చెల్లించామని తెలిపారు. ఆర్టీసీ బస్సులు, క్యాంటిన్లు, వరి కొనుగోలు కేంద్రాలు, సోలార్ ప్లాంట్లు వంటి వివిధ రంగాల్లో మహిళా సంఘాలకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. త్వరలో రైస్ మిల్లులు, గోదాములు వంటి మరిన్ని రంగాల్లోనూ మహిళలను భాగస్వాములను చేస్తామన్నారు. మహిళలను కేవలం రుణ గ్రహీతలుగా కాకుండా పెట్టుబడిదారులు, యజమానులు, ఆస్తుల సృష్టికర్తలుగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని సీతక్క అన్నారు. ఈ రాఖీ పండుగ సందర్భంగా ప్రతి అన్న తన సోదరికి రక్షణతో పాటు ఆమె ఎదుగుదలకు కూడా అండగా నిలవాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.








