- చిలకలూరిపటలో ఘోరం
- ఆటోను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు
- స్పాట్ లోనే ఏడుగురు దుర్మరణం
- మరో ఏడుగురికి గాయాలు
పల్నాడు, మహా : పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అడ్డరోడ్డు సెంటర్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ఆటోని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టడంతో దారుణం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్లోనే ఏడుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన వారు చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. ప్రకాశం జిల్లా కొండమందులూరు నుంచి వేలూరు వెళుతుండగా ఘోరం జరిగిపోయింది. పుట్టినరోజు ఫంక్షన్ లో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఉండగానే వారిని మృత్యువు కబళించింది. ఘోర రోడ్డు ప్రమాదానికి ఆటో డ్రైవరు అతిగా మద్యం సేవించడమే కారణమని స్థానికులు చెబుతున్నారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ఎదురుగా వస్తున్న వాహనాన్ని గమనించలేకపోయాడు. దీంతో ఏడుగురుని బలితీసుకున్నాడు. వారి వివరాలు బొంత బాబు, మణెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మీ, గంగమ్మ, మరియమ్మ, సుజాత అని పోలీసులు తెలిపారు. .
ప్రమాదంపై ముఖ్యమంత్రి సహా మంత్రుల దిగ్భ్రాంతి
ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందడం, పలువురు తీవ్రంగా గాయపడటంపై సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారు చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వారిగా అధికారులు వివరించారు. తీవ్రంగా గాయపడిన వారిని గుంటూరు జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం సూచించారు.
విచారం వ్యక్తం చేసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి
రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదాల వల్ల నిండు ప్రాణాలు మృత్యు ఒడికి చేరడం మనసును కలచివేస్తోందని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. ప్రయాణాలు గమ్యానికి చేర్చాలి కానీ, ఆఖరి మజిలీకి కాకూడదన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రమాద స్థలంలో పరిస్థితినీ చక్కదిద్దాలని రవాణా అధికారులకు ఆదేశించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
మాజీ సీఎం జగన్ విచారం
చిలకలూరిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం తీవ్ర విషాదకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకమని పేర్కొన్నారు. మృతులు చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందినవారిగా తెలిసిందని, ఒకే ప్రాంతానికి చెందిన పలువురు ప్రాణాలు కోల్పోవడం మరింత బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరికీ తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన అన్ని చికిత్సా సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను కోరారు. తీవ్రంగా గాయపడిన వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రోడ్డు భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని జగన్ కోరారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని జగన్ తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.








