• భార్య పుట్టింటికి వెళ్లాలంటే భర్త అనుమతి అవసరం లేదు.
• ఇంటి పనులు ఆమె ఒక్కరి బాధ్యత కాదు: కర్ణాటక హైకోర్టు.
బెంగళూరు, మహా .
వివాహ బంధంలో భర్త భార్యపై యజమానిలా ఆధిపత్యం చెలాయించడానికి వీల్లేదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. పెళ్లి చేసుకున్నంత మాత్రాన భార్య ఇంటి పనులన్నీ చేయాల్సిందేనని, అత్తమామలను తప్పనిసరిగా చూసుకోవాల్సిందేనని, పుట్టింటికి వెళ్లాలంటే భర్త అనుమతి తీసుకోవాల్సిందేనని చెప్పడానికి చట్టపరమైన ఆధారం లేదని పేర్కొంది. వివాహం అనేది పరస్పర గౌరవం, నమ్మకం, సహకారం, సమానత్వంపై కొనసాగాల్సిన బంధమని న్యాయస్థానం స్పష్టం చేసింది.
జస్టిస్ చిల్లకూరు సుమలత ధర్మాసనం ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య వ్యక్తిగత స్వేచ్ఛను భర్త లేదా అత్తమామలు తమ నియంత్రణలో ఉంచుకోవడం సమంజసం కాదని పేర్కొంది. ఒక మహిళకు వివాహం జరిగిన తర్వాత కూడా తన తల్లిదండ్రులను కలుసుకునే హక్కు, తనకు నచ్చిన విధంగా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంటుందని న్యాయస్థానం అభిప్రాయపడింది.
భర్త పిటిషన్పై కీలక వ్యాఖ్యలు
బెంగళూరు గ్రామీణ జిల్లాకు చెందిన సతీష్ తన భార్య, కుమార్తెకు కుటుంబ న్యాయస్థానం నెలకు రూ.9 వేల చొప్పున భరణం చెల్లించాలని ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించాడు. భార్య ఇంటి పనులు చేయడం లేదని, తన తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని, తన అనుమతి లేకుండానే తరచూ పుట్టింటికి వెళ్తోందని అతడు తన పిటిషన్లో పేర్కొన్నాడు.
ఈ వాదనలను పరిశీలించిన ధర్మాసనం భర్త ఆలోచనా విధానంపై తీవ్రంగా స్పందించింది. భార్యను కుటుంబంలో సమాన భాగస్వామిగా చూడకుండా ఇంటి పనులు చేసేందుకు ఉంచుకున్న వ్యక్తిగా భావిస్తున్నట్లు అతడి ఆరోపణలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది.
వివాహం జరిగిన తర్వాత భార్య తన స్వేచ్ఛను కోల్పోదని కోర్టు స్పష్టం చేసింది. భర్తతో కలిసి జీవించడం అంటే తన వ్యక్తిగత హక్కులను, తల్లిదండ్రులతో సంబంధాలను వదులుకోవడం కాదని పేర్కొంది.
పుట్టింటికి వెళ్లేందుకు అనుమతి ఎందుకు?
భార్య తన తల్లిదండ్రులను కలవడానికి పుట్టింటికి వెళ్లాలంటే భర్త లేదా అత్తమామల అనుమతి తీసుకోవాలనే భావనను హైకోర్టు ప్రశ్నించింది. ఒక వయోజన మహిళ తన తల్లిదండ్రులను కలుసుకోవడానికి ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
భార్య ఎక్కడికి వెళ్లాలి, ఎవరిని కలవాలి, తన తల్లిదండ్రులను ఎప్పుడు కలవాలి అనే విషయాలను భర్త పూర్తిగా నియంత్రించడం వ్యక్తిగత స్వేచ్ఛకు విరుద్ధంగా మారుతుందని కోర్టు అభిప్రాయపడింది. వివాహం పేరుతో మహిళ స్వేచ్ఛను పరిమితం చేయడం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది.
ఇంటి పనులు భార్య బాధ్యత మాత్రమే కాదు
ఇంట్లోని అన్ని పనులను భార్యే చేయాలనే సామాజిక భావనను కూడా ధర్మాసనం తప్పుబట్టింది. కుటుంబ బాధ్యతలు భార్యాభర్తలు పరస్పరం పంచుకోవాల్సినవేనని స్పష్టం చేసింది.
ఇంటి నిర్వహణ, పిల్లల సంరక్షణ, కుటుంబ అవసరాలు వంటి బాధ్యతలు కేవలం మహిళపైనే మోపడం సమానత్వ సూత్రానికి అనుగుణంగా ఉండదని కోర్టు అభిప్రాయపడింది. కుటుంబ జీవితం అనేది ఇద్దరి భాగస్వామ్యంతో నడవాల్సిన వ్యవస్థ అని పేర్కొంది.
అత్తమామలను చూసుకోవడం విషయంలోనూ కోర్టు స్పష్టత ఇచ్చింది. వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవాల్సిన ప్రధాన బాధ్యత వారి సొంత పిల్లలపైనే ఉంటుందని పేర్కొంది. కోడలు అత్తమామలకు సేవ చేయడం కుటుంబ అనుబంధం, ప్రేమతో జరిగితే అది వేరే విషయం అని, అయితే దాన్ని ఆమెపై తప్పనిసరి బాధ్యతగా మోపడం సమంజసం కాదని స్పష్టం చేసింది.








