- మన ఊరు మన బడి బిల్లులు చెల్లించకుంటే బడికి తాళాలు
- అప్పుల ఊబిలో కూరుకున్నాం బిల్లలు విడుదల చేయండి
- కలెక్టర్ కు విన్నవించిన కాంట్రాక్టర్స్ వెల్పేర్ అసోసియేషన్
కారేపల్లి, మహ: ప్రభుత్వ బడులలో మౌళిక వసతుల కల్పనకు మన ఊరి మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులకు వెంటనే బిల్లులు చెల్లించాలని లేదంటే సెప్టెంబర్ 17న బడులకు తాళాలు వేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. దీనికి సంబంధించి శుక్రవారం మన ఊరు మనబడి పధకంలో పనులు చేసిన కాంట్రాక్టర్లు, ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ కు వినతిప్రతం అందజేశారు. పనులు పూర్తి చేసిన మూడేండ్లు అయినా బిల్లులు చెల్లించలేదని, అప్పులు చేసి పనులు చేయించామని వారు వినతిలో ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులతో మానసిక ఒత్తిడి గురై ఆత్మహత్యలే శరణ్యంగా మారిందన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం లోపు పెండింగ్ బిల్లులు చెల్లించాలని లేనిచో పనులు చేసినా బిల్లలు రాని బడులకు గత్యంతరం లేక తాళాలు వేయటం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికైన ప్రభుత్వం కాంట్రాక్టర్ల బాధలు తెలుసుకొని బిల్లలు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో టీ.వసంతరావు, వీ.రామిరెడ్డి, గడిపర్తి వీరభద్రరావు, ఏసుబాబు, ఎన్.శ్రీనివాసరావు, రఘు తదితరులు పాల్గొన్నారు.








