Mahaa Daily Exclusive

  మంగ్లీనీ కాపాడుతున్న ఆ కేంద్ర మంత్రి ఎవరు..? రాజీకి కోట్ల రూపాయల ఎర.. నిర్మొహమాటంగా తిరస్కరించిన అడ్వకేట్ సుబ్బు..

Share

• రాజీకి కోట్ల రూపాయల ఎర.. నిర్మొహమాటంగా తిరస్కరించిన అడ్వకేట్ సుబ్బు.
• ఆమెకు అమెరికా ఈవెంట్లలో అవకాశాలు ఎలా ఇస్తారు?.
• నిలదీసిన న్యాయవాది, ఫిల్మ్ ఛాంబర్ కు ఫిర్యాదు!

హైదరాబాద్, మహా.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ప్రముఖ జానపద గాయని మంగ్లీ మైక్రో ఫైనాన్స్ కుంభకోణం కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతూ రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఒకపక్క భారీ మోసం ఆరోపణలు, మరోపక్క కేసును నీరుగార్చేందుకు తెరవెనుక సాగుతున్న విపరీతమైన ప్రయత్నాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ కేసులో బాధితుల తరపున న్యాయ పోరాటం చేస్తున్న అడ్వకేట్ సుబ్బు తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు ఈ వ్యవహారంలో దాగి ఉన్న చీకటి కోణాలను బట్టబయలు చేస్తూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి**

గాయని మంగ్లీ అలియాస్ సత్యవతి ముడావత్ చుట్టూ అలుముకున్న పది కోట్ల రూపాయల మైక్రో ఫైనాన్స్ మోసం ఆరోపణల వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతుంది. ఈ కేసులో బాధితుల పక్షాన పోరాడుతున్న అడ్వకేట్ సింగపోగు సుబ్బు తాజాగా విడుదల చేసిన ఒక వీడియో సందేశం తీవ్ర సంచలనంగా మారింది. ఈ కుంభకోణంలో కేసులను వెనక్కి తీసుకోవాలని, ఎలాగైనా రాజీకి రావాలని మంగ్లీ మనుషుల నుంచి తనకు కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిందని ఆయన బహిరంగంగా వెల్లడించడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. అయితే న్యాయం కోసం పోరాడుతున్న తాను ఆ ప్రలోభాలకు లొంగలేదని, ఆ కోట్ల రూపాయల ఆఫర్ ను తాను నిర్మొహమాటంగా తిరస్కరించానని సుబ్బు స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మంగ్లీని అమెరికాలోని ఎన్నారై తెలుగు నిర్వాహకులు అంతర్జాతీయ కార్యక్రమాలకు ఎలా ఆహ్వానిస్తారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ కేసులో వాస్తవాలు తేలే వరకు ఆమెకు విదేశీ వేదికలపై పాడే అవకాశాలు అస్సలు ఇవ్వకూడదని ఆయన డిమాండ్ చేస్తూ, ఈ వ్యవహారంపై ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్‌లో కూడా తాను ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేశారు.
మరోవైపు ఈ కేసు విచారణలో భాగంగా పోలీసు అధికారులు ఊరు దాటి వెళ్లవద్దని ఆంక్షలు విధిస్తుంటే, నిందితురాలిగా ఉన్న మంగ్లీ మాత్రం నిబంధనలను పక్కనపెట్టి యథేచ్ఛగా దేశం దాటి విదేశాలకు ఎలా వెళ్లగలుగుతోందని సుబ్బు సూటిగా నిలదీశారు. ఆమెను ఎవరూ అరెస్ట్ చేయకుండా వెనకుండి చక్రం తిప్పుతూ కాపాడుతున్న ఆ అదృశ్య శక్తి, ఆ కేంద్ర మంత్రి ఎవరనేది ప్రజలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాలని ఆయన పిలుపునివ్వడం అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సినీ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. అలాగే ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు అనేక కుట్రలు జరుగుతున్నాయని, ఈ వ్యవహారంలో అత్యంత కీలక సాక్షి అయిన డ్రైవర్ ఏమయ్యాడని, అతడిని మంగ్లీతో లాలూచీ పడేలా చేసింది ఎవరని ఆయన సంధించిన సంచలన ప్రశ్నలు కేసు తీవ్రతను మరింత పెంచుతున్నాయి. ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని కోట్ల రూపాయల ఆశ చూపినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు న్యాయస్థానాల్లో తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని అడ్వకేట్ సుబ్బు తెగేసి చెప్పారు. ఈ వ్యవహారం మొత్తం మీద వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని సుబ్బు ఆరోపిస్తుండగా, మంగ్లీ మాత్రం ఇవన్నీ తప్పుడు ఆరోపణలని, తనను బ్లాక్ మెయిల్ చేసేందుకే ఇదంతా చేస్తున్నారని కౌంటర్ కేసులు నమోదు చేయడంతో ఈ వివాదం రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలకు దారి తీస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.